కరోనా సెకండ్ వేవ్ ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలను వణికిస్తోన్న పదం. అయితే భారత్కు ఈ ముప్పు లేనట్టేనా..? కరోనా సెకండ్ వేవ్ పై వైద్య నిపుణులు చెబుతున్న గుడ్ న్యూస్ ఏంటి..?
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్ గుబులు భారత్ లోనూ రేగింది. అయితే ఏ క్షణాన వైరస్ విజృంభిస్తుందో అన్న భయంతో ప్రజలు కాలం గడుపుతున్న వేళ వైద్య నిపుణులు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
భారత్ లో కరోనా వైరస్ పతాకస్థాయి దశ ముగిసిందని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ చెప్పుకొచ్చారు. సెప్టెంబరు మాసం మధ్యలో ప్రతి రోజూ 93 వేల వరకు కొత్త కేసులు వచ్చిన పరిస్థితి చూశామని, కానీ ఇప్పుడు రోజుకు పాతిక వేల కేసులు మాత్రమే వస్తున్నాయన్నారు. కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించని నేపథ్యంలో కరోనా పతాకస్థాయి దశ ముగిసినట్టేనని భావించాలని షాహిద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి నెమ్మదించడం గుడ్ న్యూస్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు వైరస్ బారినపడే అవకాశాలను కొట్టివేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకప్పుడు ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదని, సెకండ్ వేవ్ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అత్యధిక కేసులు వచ్చిన దేశాల్లో ఒకటైన భారత్ లో కరోనా రెండో తాకిడి వచ్చినా అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చని రాష్ట్రాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, కొన్నిచోట్ల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక వైరస్ ఉదృతి తగ్గిన నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం కూడా మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మూల్యం తప్పదంటున్నారు.