Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ‘బ్రహ్మాస్త్రం’: ఎంపీ సభ్యత్వం రద్దుకు ‘సబ్‌స్టాంటివ్ మోషన్’.. జీవితకాల నిషేధానికి డిమాండ్!
Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది.
Rahul Gandhi: పార్లమెంట్ వేదికగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం కీలక అడుగు వేశారు. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, ఆయనపై జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ లోక్‌సభలో ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ (Substantive Motion) దాఖలు చేశారు.
రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల్లో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని నిషికాంత్ దూబే ఆరోపించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, USAID వంటి సంస్థలతో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని దూబే తన తీర్మానంలో పేర్కొన్నారు. థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనల్లో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆయన ప్రవర్తించారని విమర్శించారు. ఇది కేవలం ‘ప్రివిలేజ్ మోషన్’ కాదని, దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం బడ్జెట్ చర్చ సందర్భంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందాన్ని ఆయన 'టోకు లొంగుబాటు' (Wholesale Surrender) గా అభివర్ణించారు. దేశ ఇంధన భద్రతను, రైతు ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని చిక్కుల్లో పడేసినట్లుగా, ఈ ఒప్పందం భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో అగ్గి రాజేశాయి.
సబ్‌స్టాంటివ్ మోషన్ అంటే ఏమిటి?
పార్లమెంట్ నిబంధనల ప్రకారం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లేదా స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై లేదా సభ్యులపై నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇది అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం వంటి స్వతంత్ర తీర్మానం. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడు ఆరోపణలకు తగిన ఆధారాలను సభ ముందు ఉంచాల్సి ఉంటుంది. సభ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. రాహుల్ గాంధీపై బీజేపీ వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.