DGCA Free Seat Rule : భారీ కుట్రనా? ఒత్తిడినా? 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనను ఎందుకు తొలగించారు

DGCA Free Seat Rule : విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. విమానయాన సంస్థల అభ్యంతరాల నేపథ్యంలో, పాత పద్ధతిలోనే సీట్ సెలక్షన్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

CR Reddy
Published on: 3 April 2026 6:48 AM IST
DGCA Free Seat Rule :  భారీ కుట్రనా? ఒత్తిడినా? 60 శాతం ఫ్రీ సీట్ల నిబంధనను ఎందుకు తొలగించారు
X

DGCA Free Seat Rule : విమాన ప్రయాణికులకు చౌకగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మార్చి 18న ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)ను ఆదేశించింది. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు సీట్ల ఎంపిక కోసం పెట్టే అదనపు భారం తగ్గుతుందని భావించారు. అయితే, ఈ ఆదేశాలను గురువారం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది.

ప్రభుత్వ నిర్ణయంపై విమానయాన సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఆకాశ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థలు ప్రభుత్వం వద్ద తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. 60 శాతం సీట్లను ఉచితంగా ఇస్తే తమ ఆదాయం భారీగా పడిపోతుందని, నిర్వహణ ఖర్చులు పెరిగి టికెట్ ధరలను పెంచాల్సి వస్తుందని వారు వాదించారు. ప్రస్తుతం విమానయాన సంస్థలకు సీట్ సెలక్షన్ ఛార్జీలు అనేవి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఈ ఒత్తిడి తలొగ్గిన ప్రభుత్వం, ఈ నిబంధన వల్ల కలిగే ప్రభావంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసే వరకు దీనిని అమలు చేయబోమని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో, ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవాలంటే పాత పద్ధతిలోనే జేబులు ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం విమానాల్లో కేవలం 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన 80 శాతం సీట్లకు ప్రయాణికులు అదనపు మొత్తం చెల్లించాలి. సాధారణంగా విమానాల్లో ముందు వరుస సీట్లు లేదా కాళ్లు చాపుకోవడానికి వీలుగా ఉండే సీట్ల కోసం రూ.200 నుంచి రూ.2,100 వరకు వసూలు చేస్తున్నారు. ఈ అదనపు ఛార్జీల భారం ప్రయాణికులపై యధాతథంగా కొనసాగుతుంది.

సీట్ల నిబంధన పక్కన పెట్టినప్పటికీ, ప్రయాణికుల హక్కులకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఒకే PNR నంబర్‌పై టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను (కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు) సాధ్యమైనంత వరకు పక్కపక్కనే కూర్చోబెట్టాలని ప్రభుత్వం సూచించింది. అలాగే సంగీత వాయిద్యాలు, క్రీడా పరికరాలు, పెంపుడు జంతువులను తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని ఆదేశించింది. ప్రయాణికులు చెల్లించే ప్రతి అదనపు పైసాకు సంబంధించి విమానయాన సంస్థలు పూర్తి పారదర్శకత పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు ఐదు లక్షల మందికి పైగా విమాన ప్రయాణాలు చేస్తున్నారు. విమానయాన సంస్థల వాదన ప్రకారం.. సీట్ సెలక్షన్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది. కానీ, సామాన్య ప్రయాణికులు మాత్రం ఇప్పటికే పెరుగుతున్న టికెట్ ధరలతో పాటు ఈ అదనపు వసూళ్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు విమానాల్లో 'ఫ్రీ సీటు' దొరకడం అనేది అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది.

CR Reddy

CR Reddy

Next Story