New Toll Rules : వాహనదారులకు బంపర్ ఆఫర్..టోల్ బాదుడు నుంచి సామాన్యుడికి ఊరట

వాహనదారులకు బంపర్ ఆఫర్..టోల్ బాదుడు నుంచి సామాన్యుడికి ఊరట

Update: 2026-02-13 01:47 GMT

New Toll Rules : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై సగం పూర్తయిన లేదా ఎండ్-టు-ఎండ్ కనెక్టివిటీ లేని ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించినందుకు భారీగా టోల్ బాదుడు ఉండదు. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా సిద్ధం కానప్పుడు, దానిపై ప్రయాణికులకు ఇచ్చే సౌకర్యాలు కూడా పరిమితంగానే ఉంటాయని గుర్తించిన ప్రభుత్వం, టోల్ ఛార్జీలను తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నేషనల్ హైవేల కంటే ఎక్స్‌ప్రెస్‌వేలపై 25 శాతం అదనపు టోల్ వసూలు చేస్తారు. రోడ్డు పూర్తిగా సిద్ధం కాకపోయినా, కొన్ని కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి వచ్చినా సరే.. పాత నిబంధనల ప్రకారం వాహనదారుల నుంచి ఎక్కువ టోల్ వసూలు చేసేవారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో, కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఫీజ్ రూల్స్-2008లో సవరణలు చేసింది. కొత్త నిబంధన ప్రకారం, ఏదైనా ఎక్స్‌ప్రెస్‌వే ఎండ్-టు-ఎండ్ (మొదటి నుంచి చివరి వరకు) పూర్తి కాకపోతే, దానిపై ప్రయాణించినందుకు సాధారణ నేషనల్ హైవే రేట్లనే వసూలు చేయాలని స్పష్టం చేసింది. అంటే ఇకపై అదనపు 25 శాతం భారం ప్రయాణికులపై పడదు.

ఎప్పటి నుంచి అమలు?

కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కొత్త టోల్ విధానం ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఈ వెసులుబాటు సదరు ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా ప్రారంభమయ్యే వరకు లేదా గరిష్టంగా ఏడాది కాలం వరకు వర్తిస్తుంది. అంటే రోడ్డు పనులు పూర్తి కావడంలో జాప్యం జరిగినా సరే, వాహనదారులు తక్కువ టోల్‌తోనే ప్రయాణించవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు ఆర్థికంగా భారీ ఊరట లభించడమే కాకుండా, ఎక్స్‌ప్రెస్‌వేల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రయాణికులకు లాభాలేంటి?

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మల్టీ-లెవల్ ప్రయోజనాలు ఉన్నాయి:

ట్రాఫిక్ కష్టాలు దూరం: టోల్ తక్కువగా ఉండటం వల్ల వాహనదారులు పాత హైవేలపై కాకుండా కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీనివల్ల పాత రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

వేగవంతమైన ప్రయాణం: ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణం వల్ల సమయం ఆదా అవుతుంది, ఫలితంగా రవాణా వేగం పెరుగుతుంది.

కాలుష్యానికి కట్టడి: ట్రాఫిక్ జామ్‌లు తగ్గడం వల్ల ఇంధన వినియోగం తగ్గి, వాయు కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

సులభంగా సాగే ప్రయాణం

సగం సిద్ధమైన రోడ్లపై కూడా పూర్తి టోల్ వసూలు చేయడం సరికాదని కేంద్రం గుర్తించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఫిబ్రవరి 15 నుంచి ఇది అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వందలాది కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణం మరింత చౌకగా మారుతుంది. ప్యాసింజర్ వెహికిల్స్ తో పాటు సరుకు రవాణా చేసే లారీల యజమానులకు కూడా ఇది గొప్ప వార్త. మొత్తం మీద, కేంద్ర ప్రభుత్వం డిజిటల్ టోల్ వసూలు (Fastag) తర్వాత టోల్ నిబంధనలలో చేస్తున్న అతిపెద్ద మార్పు ఇదే.

Tags:    

Similar News