Kiren Rijiju: స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి
Kiren Rijiju: పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ ముదిరి పాకాన పడింది.
Kiren Rijiju: పార్లమెంట్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ ముదిరి పాకాన పడింది. ఫిబ్రవరి 4న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌ను దుర్భాషలాడటమే కాకుండా, ప్రధాని మోదీని కూడా బెదిరించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
కిరణ్ రిజిజు పంచుకున్న వీడియోలో సుమారు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లోకి దూసుకెళ్లడం కనిపిస్తుంది. వారు అక్కడ అత్యంత ఆవేశంగా మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వారిని వారించే ప్రయత్నం చేశారు.
"ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ చట్టవిరుద్ధంగా తీసిన వీడియో. స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ప్రధాని మోదీపై కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేశారు" అని రిజిజు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకే ప్రాధాన్యం ఇస్తుందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాలను ఎప్పటికీ ప్రోత్సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల స్పీకర్ ఓం బిర్లా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సభలో ప్రతిపక్షాలు ప్రధాని మోదీని చుట్టుముట్టేందుకు (Gherao) కుట్ర పన్నాయని, ఆ ప్రమాదాన్ని పసిగట్టి తాను ప్రధానిని సభలోకి రావొద్దని సూచించానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రిజిజు తాజా వీడియోను బయటపెట్టడం గమనార్హం.
ఈ వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సభా మర్యాదలను కాంగ్రెస్ ఎంపీలు తుంగలో తొక్కారంటూ బీజేపీ విమర్శిస్తుండగా, ప్రభుత్వం కావాలనే తమపై బురద చల్లుతోందని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి.