లాక్‌డౌన్ 4.0 సడలింపులు.. నిర్ణయాధికారం రాష్ట్రాలకే
కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. సోమవారం నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో నెలకుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్ పంపాలని సూచించారు. దీనికి సంబంధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.
ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాలకు మరిన్ని సడలింపులను ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. జోన్లు, హాట్‌స్పాట్ల నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేయనుంది.
అయతే ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢీల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రిని కోరాయి. కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని తమిళనాడు కోరింది. 18వ తేదీ నుంచి 50% సిబ్బంది కార్యాలయాలకు రావాలని ఆ రాష్టంలో ఉత్తర్వులు జారీ చేసింది.
* కంటెయిన్‌మెంట్ జోన్లు మినహా రెడ్‌జోన్లలో కటింగ్ షాపులు, కళ్లజోళ్ల షాపులు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని తెలుస్తోంది. లాక్‌డౌన్ పూర్తి ఎత్తివేతను ఏ రాష్ట్రమూ కోరుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
* నిత్యావసరేతర వస్తువులను విక్రయించడానికి సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
* పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు.
* హోం డెలివరీ కి అవకాశం ఉంటుంది.
* మెట్రో రైళ్లు, స్థానిక రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది.
* పట్టణ ప్రాంతాల్లో అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలన్నది గుజరాత్ డిమాండ్.
* కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేసి వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
* మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి.
* బిహార్, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్ చేశారు.