Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడికి పోలీస్ కస్టడీ
Saif Ali Khan Attacker gets Police Custody: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడికి ముంబై కోర్టు జడ్జి 5 రోజుల పోలీసు కస్టడీ విధించారు. బుధవారం రాత్రి బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడి, సైఫ్ ను, ఆయన ఇంట్లో పనిచేసే సిబ్బందిని గాయపర్చిన కేసులో పోలీసులు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి పేరు మార్చుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్. భారత్‌లో విజయ్ దాస్‌గా మారుపేరుతో తిరుగుతున్నట్లు ముంబై పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన తరువాత నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు 70 గంటల సమయం పట్టింది. దీంతో పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోందంటూ విపక్షాల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడి లక్ష్యం ఏంటి? ఎందుకు ఏ నేరం చేశాడు వంటి అనేక కీలక ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టాల్సి ఉంది.
ఈ క్రమంలోనే ముంబై పోలీసులు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తున్నట్లు ఆదేశాలిచ్చింది.