Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్నారని గ్రామస్థుల బహిష్కరణ తీర్మానం.. మోహాలీలో వివాదాస్పద పరిణామం

Love Marriage: పంజాబ్ రాష్ట్రంలోని మోహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ గ్రామంలో ఇటీవల ప్రేమ వివాహాలపై సంచలన తీర్మానం ఆమోదించబడింది.

Update: 2025-08-05 06:15 GMT

Love Marriage: లవ్ మ్యారేజ్ చేసుకున్నారని గ్రామస్థుల బహిష్కరణ తీర్మానం.. మోహాలీలో వివాదాస్పద పరిణామం

Love Marriage: పంజాబ్ రాష్ట్రంలోని మోహాలీ జిల్లాలోని మనక్‌పూర్ షరీఫ్ గ్రామంలో ఇటీవల ప్రేమ వివాహాలపై సంచలన తీర్మానం ఆమోదించబడింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న యువతను గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా జూలై 31న తీర్మానించారు.

గ్రామపంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. కోర్టు వివాహం చేసుకున్నా లేదా పరారై పెళ్లి చేసుకున్నా గ్రామంలో నివసించేందుకు అనుమతించబోమని తీర్మానంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఇలాంటి జంటలకు సహాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు గ్రామస్తులు అంగీకరించారు.



సాంప్రదాయ రీత్యా తీసుకున్న నిర్ణయం: గ్రామ సర్పంచ్

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దల్వీర్ సింగ్ మాట్లాడుతూ, "ఇది శిక్ష కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకున్న నివారణ చర్య మాత్రమే. ఇది మన సంప్రదాయాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం," అని పేర్కొన్నారు.

మానవ హక్కుల కార్యకర్తల ఆగ్రహం

ఈ తీర్మానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తిగత హక్కులను హరించేదిగా ఉందని మానవ హక్కుల సంస్థలు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేయడం వ్యక్తుల మౌలిక హక్కు అని వారు పేర్కొన్నారు.

అధికారుల స్పందన

మోహాలీ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ (గ్రామీణ) సోనమ్ చౌదరి మాట్లాడుతూ, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ఒకవేళ ఫిర్యాదు వస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "పెద్దవయస్సు వచ్చిన వ్యక్తులు తమ ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కు కలిగి ఉంటారు," అని ఆమె పేర్కొన్నారు.

దవీందర్–బేబీ వివాహం తర్వాతే తీర్మానం

గ్రామానికి చెందిన 26 ఏళ్ల దవీందర్ అనే యువకుడు తన 24 ఏళ్ల మేనకోడలు బేబీతో ప్రేమ వివాహం చేసుకున్న ఘటన నేపథ్యంలో ఈ తీర్మానం రూపొందించబడినట్టు సమాచారం. ఈ పెళ్లి తర్వాత వారు గ్రామం నుంచి వెలివేయబడ్డారు. ఇది గ్రామంలో నివసిస్తున్న 2,000 మంది గ్రామస్తులలో కలకలం రేపింది.

తాలిబానీ తీర్మానమంటూ రాజకీయ నేతల మండిపాటు

పాటియాలా ఎంపీ ధరంవీర గాంధీ ఈ తీర్మానాన్ని తీవ్రంగా ఖండించారు. "ఇవి తాలిబానీ ఆదేశాలు లాంటివి. జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి భారత పౌరునికి ఉంది," అని విమర్శించారు. పంజాబ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజ్ లల్లి గిల్ కూడా ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News