దుమారం రేపుతున్న ప్రధాని భద్రతా లోపాల ఎపిసోడ్

PM Security Breach: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.

Update: 2022-01-06 15:00 GMT

దుమారం రేపుతున్న ప్రధాని భద్రతా లోపాల ఎపిసోడ్

PM Security Breach: ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని బీజేపీ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఎదురు దాడి చేస్తోంది. మోడీ సభలో జనం లేకపోవడంతో అక్కడి నుంచి బయటపడేందుకే సెక్యూరిటీ లోపం పేరిట డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా లోపాలపై చర్చించారు. ఫిరోజ్‌పూర్‌లో నిన్న జరిగిన పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు ప్రధాని మోడీ.

మరోవైపు ప్రధాని మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ ముందు విచారణకు డిమాండ్ చేశారు సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్. అయితే పిటిషన్ కాపీని కేంద్రం, పంజాబ్ ప్రభుత్వానికి అందించాలని.., సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్‌ను కోరింది అత్యున్నత ధర్మాసనం. అదేవిధంగా పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అంతేకాదు ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలపై విచారణ కోసం పంజాబ్ ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అసలు ఫిరోజ్‌పూర్‌లో ఏం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ మూడు రోజుల్లోనే తమ నివేదికను సమర్పించనుంది. ఐతే పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారు ఏం తేల్చుతారో తమకు తెలుసని, పంజాబ్ ప్రభుత్వానికి అనుకూలంగానే రిపోర్టు ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు ఫిరోజ్‌పూర్‌ ఘటనపై కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయింది. ప్రధాని కాన్వాయ్ అడ్డగింత యాదృచ్చికమేనని ఒకవర్గం అంటుంటే మరో వర్గం భద్రతా లోపాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా నేరుగా రంగంలోకి దిగారు. ఫిరోజ్‌పూర్‌లో నిన్న ఏం జరిగిందన్న దానిపై పంజాబ్ సీఎం చరణ్‌జీత్‌ సింగ్ చన్నీకి కాల్ చేశారు. నిన్నటి సంఘటన వివరాలపై ఆరా తీశారు. దేశ ప్రధాని భద్రత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలని చన్నీకి సూచించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News