బీటెక్ కనీస ఫీజు రూ.75వేలు.. నిర్ధారించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ

Justice Srikrishna Committee: బీటెక్ కనీస ఫీజును 75వేల రూపాయలుగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది.

Update: 2021-10-07 10:37 GMT

బీటెక్ కనీస ఫీజు రూ.75వేలు.. నిర్ధారించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ

Justice Srikrishna Committee: బీటెక్ కనీస ఫీజును 75వేల రూపాయలుగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాల ప్రవేశాల, రుసుముల నియంత్రణ కమిటీలకు లేఖలు రాసింది. ఆయా వృత్తి విద్యా కోర్సులకు ఫీజులను నిర్ణయించే తుది అధికారం AFRCలదే. అవి నిర్ణయించే రుసుం శ్రీకృష్ణ కమిటీ నిర్దేశించిన కనీసం కంటే తక్కువ ఉంటే ఆ కాలేజీల్లో కనీస మౌలిక వసతులు లేనట్లుగా భావిస్తారు. అయితే వాటికి మూడేళ్ల గడువు ఇస్తారు. ఆ లోపు అవసరమైన సౌకర్యాలను కల్పించకుంటే వాటిని మూసివేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై తమ అభిప్రాయాలను పంపేందుకు తెలంగాణ AFRC కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ బీటెక్ కనీస ఫీజు 35వేలు, గరిష్ఠం 1.34 లక్షలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠ రుసుమే 70వేలుగా ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 158 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే వాటిల్లో 35వేలు ఫీజు వసూలు చేస్తున్న కాళాశాలలు 20, 75వేల లోపున్న కాలేజీలు 100 వరకు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణ కమిటీ నిర్దేశించిన మేరకు అమలు చేస్తే ఫీజలు భారీగా పెరుగుతాయి. అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుంది.

దేశంలోని కొన్ని విద్యాసంస్థలు భారీగా ఫీజలు వసూలు చేస్తున్నాయి. బీటెక్‌కు 5లక్షలు, MBAకు 3లక్షలు నుంచి 9 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు AICTE 2014 ఏప్రిల్‌ 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ ఛైర్మన్‌గా జాతీయ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2015 ఏప్రిల్ 7న AICTEకి నివేదిక అందజేసింది. అయితే అప్పట్లో గరిష్ఠ ఫీజులను మాత్రమే నిర్ధేశించగా వాటిని అమలు చేయలని 2017 జనవరిలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. AFRCలు మాత్రం ఫీజుల నిర్ణయంలో తమదే తుది అధికారమంటూ ఆ ఆదేశాలను పక్కనబెట్టాయి. కనిష్ఠ ఫీజు కూడా నిర్ణయించాలని పలు కళాశాలలు కోరడంతో ఆ బాధ్యతను కూడా AICTE శ్రీకృష్ణ కమిటీకే అప్పగించింది.

Tags:    

Similar News