కమల్‌నాథ్‌ వ్యవహారంపై స్పందించిన ఈసీ

Update: 2020-10-20 07:59 GMT

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వ్యవహారం ఈసీకి చేరింది. రాష్ట్ర మహిళా మంత్రి ఇమర్తి దేవిని ఐటం అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ మధ్యప్రదేశ్ ఎలక్టోరల్‌ అదికారిని నివేదిక కోరింది. ఇవాళ పూర్తి వివరాలతో ఎలక్షన్‌ కమిషన్‌కు నివేదిక అందనుండగా నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది ఈసీ.

ఆదివారం గ్వాలియర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కమల్‌ నాథ్‌ పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి అన్న కమల్‌నాథ్‌ ప్రత్యర్థి అయిన ఇమర్తి దేవిని ఐటెం అంటూ మాట తూలారు. దీంతో ఓ దళిత మంత్రిని కమల్‌ ఇలా కామెంట్‌ చేయటమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కమల్‌ వ్యాఖ్యలకు నిరసనగా మధ్యప్రదేశ్‌ సీఎం చౌహాన్‌ మౌనదీక్ష కూడా చేపట్టారు. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీకి లేఖ రాశారు‌. హరిజన మహిళను గౌరవించలేని కమల్‌నాథ్‌ను అన్ని పదవుల నుంచి తప్పించాలని లేఖలో కోరారు శివరాజ్ సింగ్‌ చౌహాన్‌. మరోవైపు జాతీయ మహిళా కమిషన్‌ కూడా కమల్‌ వ్యాఖ్యలను ఖండించింది. ఈసీకి ఈ విషయాన్ని చేరవేసింది. అయితే ఇవాళ నివేదిక అందనుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News