Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పరిపాలన అధికారి మృతి
Operation Sindoor: భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ నిరంతరం క్షిపణి దాడులు చేస్తోంది. భారత సైన్యం వీటిని గాల్లోనే నాశనం చేస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ డ్రోన్లు భారత్ లోని అనేక ప్రాంతాల్లో విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ దుర్మార్గంగా దాడులకు దిగుతోంది. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతోనూ దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వాధికారి రాజ్ కుమార్ తప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాకిస్తాన్ ఫిరంగులు పడటంతో ఆయన మరణించారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. రాజ్ కుమార్ జిల్లా డెవలప్ మెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా రాజ్ కుమార్ మరణంపై ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నిబద్ధత కలిగిన ఓ అధికారిని మనం కోల్పోయాము. ఒక్కరోజు ముందు నేను అధ్యక్షత వహించిన ఆన్ లైన్ సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ జరిపిన దాడుల్లో రాజ్ కుమార్ మరణించారు. దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకు ఎంతో నష్టం అంటూ పోస్టు చేశారు.