Maharashtra: వసూల్‌రాజాపై సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే- ఫడ్నవీస్‌

Maharashtra: మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని కామెంట్‌ చేశారు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌.

Update: 2021-03-23 15:30 GMT

Maharashtra: వసూల్‌రాజాపై సీబీఐ దర్యాప్తు జరపాల్సిందే- ఫడ్నవీస్‌

Maharashtra: మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుంటోందని కామెంట్‌ చేశారు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌. అవినీతి పరుడైన హోం మంత్రిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వాన్నే ఫణంగా పెట్టాలనుకుంటోందని చెప్పారాయన. త్వరలోనే ఢిల్లీ వెళ్లి హోం మంత్రికి థాకరే ప్రభుత్వ బండారాన్ని వివరిస్తానని చెప్పారు. వసూల్‌రాజాపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారాయన. పోలీస్‌ శాఖలో బదిలీలు, పోస్టింగ్‌ల రాకెట్‌కు సంబంధించిన కీలక పత్రాలు, కాల్‌ రికార్డ్‌లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు ఫడ్నవీస్‌. బదిలీ రాకెట్‌కి సంబంధించి తన వద్ద మొత్తం 6.3 జీబీ డేటా ఉందని అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన సమస్త సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉందని చెప్పారు. జరుగుతున్న అవినీతి గురించి సీఎం కొంత ఆందోళన చెందినప్పటికీ చర్యలు తీసుకోవడానికి ఆయన సాహసించడంలేదని ఫడ్నవీస్‌ విమర్శించారు.

ఇదిలాఉంటే మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ తనపై వస్తున్న ఆరోపణలకు తొలిసారి వివరణ ఇచ్చారు. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత అధికార కార్యక్రమాల కోసం తొలిసారి తాను ఫిబ్రవరి 28న ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావీయరాదనే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 15న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్టు బీజేపీ ఒక వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags:    

Similar News