Swami Chaitanyananda: శృంగేరి పీఠం బ్రాంచ్‌లో దారుణం.. 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన స్వామీజీ!

Delhi Ashram Scandal: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ ఆశ్రమంలో ఓ స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.

Update: 2025-09-24 07:01 GMT

Delhi Ashram Scandal: దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ ఆశ్రమంలో ఓ స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి. స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధి అనే స్వామీజీపై డజను మందికి పైగా మహిళా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆశ్రమంలోని బలహీన వర్గాల విద్యార్థినులకు పీజీ మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తారు. పోలీసులు ఆశ్రమంలోని 32 మంది విద్యార్థినులను విచారించగా, వారిలో 17 మంది విద్యార్థినులు స్వామీజీపై ఆరోపణలు చేశారు. స్వామీజీ ద్వేషపూరిత భాషను వాడుతున్నారని, శృంగారభరిత మెసేజ్‌లు పంపుతున్నారని, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా స్వామీజీకి లొంగిపోవాలంటూ తమపై ఒత్తిడి తెచ్చారని విద్యార్థినులు ఆరోపించారు. ఆశ్రమం వార్డెన్లే నిందితుడిని తమకు పరిచయం చేశారని తెలిపారు.

విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్వామీ చైతన్యానందపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదు కాగానే నిందితుడు పరారీలోకి వెళ్ళాడు. అతడి అడ్రస్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆగ్రా సమీపంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఆశ్రమం బేస్‌మెంట్‌లో ఉన్న ఒక వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్ (39 UN 1) ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఈ కారును వాడినట్లు తేలడంతో, పోలీసులు దాన్ని సీజ్ చేశారు.

శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఘటనపై ఆ పీఠం ఒక ప్రకటన విడుదల చేస్తూ, స్వామీ చైతన్యానంద ప్రవర్తన అక్రమంగా, అసహజంగా ఉందని పేర్కొంది. నిందితుడితో తమకు ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించింది. నిందారోపణల నేపథ్యంలో ఆశ్రమం యాజమాన్యం కూడా ఆ స్వామీజీని విధుల నుంచి తొలగించింది.

Similar News