Ration Card Rules : రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..పాటించకపోతే బియ్యం కట్

Ration Card Rules : ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న రేషన్ కార్డు కొత్త నిబంధనలు ఇవే. e-KYC తప్పనిసరి, ఆదాయ పరిమితి మార్పు, కార్డు రద్దు అయ్యే కారణాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Update: 2026-03-30 02:44 GMT

Ration Card Rules

Ration Card Rules : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అనర్హులను ఏరివేసేందుకు ఏప్రిల్ 1, 2026 నుంచి సరికొత్త నిబంధనలను అమలులోకి తెస్తోంది. ఇప్పటి వరకు ఉన్న పద్ధతులకు భిన్నంగా, ఇకపై సాంకేతికతకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తమ వివరాలను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఏప్రిల్ నుంచి మీకు వచ్చే కోటా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

e-KYC చేయించలేదా?

కొత్త నిబంధనల ప్రకారం రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. కుటుంబంలో ఐదుగురు ఉంటే, ఐదుగురూ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లవచ్చు లేదా మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో ఇంట్లోనే ఉండి పని పూర్తి చేయవచ్చు. గడువులోపు KYC పూర్తి చేయని వారి పేర్లను డేటాబేస్ నుంచి తొలగిస్తారు, అంటే ఆ సభ్యుడికి రావాల్సిన బియ్యం లేదా పప్పులు ఇకపై రావు.

ఆదాయ పరిమితి పెంపు.. కొత్త కార్డులకు ఛాన్స్

కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గతంలో ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో వార్షిక ఆదాయ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.20 లక్షలకు పెంచారు. అలాగే, మహిళా సాధికారతకు ప్రాముఖ్యతనిస్తూ, 18 ఏళ్లు నిండిన మహిళను మాత్రమే ఇకపై కుటుంబ పెద్దగా గుర్తిస్తారు. ఒకవేళ ఇంట్లో మహిళలు లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పురుషుడిని యజమానిగా పరిగణిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు.. ఇంటి వద్దే వెరిఫికేషన్

ఇకపై రేషన్ కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ మయం చేసింది. అవసరమైన ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, కరెంటు బిల్లు వంటి పత్రాలతో ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. అయితే, మీరు దరఖాస్తు చేయగానే కార్డు రాదు. ఫుడ్ సప్లై ఆఫీసర్ నేరుగా మీ ఇంటికి వచ్చి మీరు ఇచ్చిన వివరాలు నిజమో కాదో ధృవీకరించిన తర్వాతే కార్డు జారీ అవుతుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కార్డు ఎప్పుడు రద్దవుతుందో తెలుసా?

కొత్త రూల్స్ ప్రకారం కొన్ని పరిస్థితుల్లో రేషన్ కార్డులు ఆటోమేటిక్ గా రద్దవుతాయి. మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్నా, లేదా సొంతంగా నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్ మినహా) ఉన్నా మీరు రేషన్ కార్డుకు అనర్హులు. అలాగే వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే, మీకు ఆ అవసరం లేదని భావించి ప్రభుత్వం కార్డును రద్దు చేస్తుంది. ఇంట్లో ఎవరైనా మరణించినా లేదా పెళ్లై వేరే ఊరు వెళ్ళిపోయినా వారి పేర్లను వెంటనే తొలగించాలి, లేదంటే పూర్తి కార్డుకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

Tags:    

Similar News