దేశవ్యాప్తంగా 14వేలకు చేరిన కరోనా కేసులు
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా మహమ్మారి కేసులు మాత్రం తగ్గడం లేదు.
కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా మహమ్మారి కేసులు మాత్రం తగ్గడం లేదు..గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,100 కేసులు నిర్ధారణ కాగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,352కు చేరుకుంది.ఇప్పటి వరకు 486 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్ర లో అత్యధిక కేసులు నమోదయ్యాయి..
మహారాష్ట్రలో 3,320 కేసులు నమోదయ్యాయి. మొత్తం 201 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మరో 118 కేసులు నమోదు కాగా.. ముంబయిలోనే 2,200 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నిర్దారణ కావడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.. శుక్రవారం ఒక్క రోజే గుజరాత్‌లో అత్యధికంగా 170 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,000 దాటింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.. తెలంగాణలో నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి దీనితో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 766కి చేరింది. 18 మంది మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. శుక్రవారం 38 కేసులు నమోదయ్యాయి. దీనితో ఏపీలో మొత్తం 572 కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు.