ఓట్ల దొంగలారా..గద్దె దిగండి!: ఢిల్లీ ర్యాలీలో ప్రియాంక గర్జన

Update: 2025-12-14 10:47 GMT

న్యూఢిల్లీ: ‘‘ఓట్ల దొంగలారా! గద్దె దిగండి!’’ అని ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నాలో ప్రియాంక గాంధీ వాద్రా గర్జించారు. అందరూ ఒకసారి గట్టిగా నినదించండి.. ఈ అరుపు మోదీ ఇంటిదాకా వినిపించాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఈరోజు ఈ భారీ మహా ధర్నా నిర్వహించింది. ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితర జాతీయ నేతలతోపాటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ మహా ధర్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన పోరాటమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ర్యాలీలో భారీ జన సమూహాన్ని పాల్గొనేలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ప్రదర్శించింది. ఈ ధర్నా ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కోరుతూ కాంగ్రెస్ గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లు జోడించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్టు తెలిపారు.

Tags:    

Similar News