China Troops Stepped Back From Galvan Valley: తోక ముడిచిన చైనా బలగాలు

Update: 2020-07-07 13:16 GMT

China Troops Stepped Back From Galvan Valley: లద్దాక్ పరిసర ప్రాంతాల్లో అధీన రేఖను దాటేసి ముందుకొచ్చిన చైనాదళాలు ఎట్టకేలకు తోక ముడిచాయి. ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా వెనక్కు తప్పుకుంది. డ్రాగన్ కంట్రీ తోక ముడవడమే కాక వివాదాస్పద ప్రాంతంలో టెంట్ లు, వాహనాలు కూడా వెనక్కు మళ్లించింది. గాల్వన్ నది మలుపు తిరిగే చోట గట్టు ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించి చైనా సైనికులు నిర్మించిన తాత్కాలిక కట్టడాలను ఇరు దేశాలకు చెందిన సైనికులు తొలగించారు.

భారత సరిహద్దు అయిన లఢక్‌లోని గాల్వాన్ లోయ దగ్గర నుంచి చైనా సైన్యం దాదాపు ఒక కిలోమీటరు వెనక్కి వెళ్లింది. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూడా తొలగించింది. భారత సైన్యం జూన్ 15న వీరోచితంగా పోరాడటం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్‌ని నిషేధించడం, చైనా కంపెనీలకు ప్రాజెక్టులను రాష్ట్రాలు రద్దు చేసుకోవడం, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ భారత్‌కి అండగా నిలవడం ఇవన్నీ చూసి చైనా ఇక తన ఆటలు సాగవని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈమధ్య రెండు దేశాల మధ్యా కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. అందులో రెండు దేశాలూ సైన్యాన్ని వెనక్కి పంపుకోవాలని నిర్ణయించాయి. కానీ చైనా సైన్యాన్ని వెనక్కి తీసుకోకుండా నాల్రోజులు నాటకాలు ఆడింది. ఇప్పుడు డ్రాగన్‌ని తెలిసొచ్చిందేమో శిబిరాల్ని తొలగించి సైన్యాన్ని వెనక్కు పిలిపించుకుంది. ఐతే ఇప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట భారీగా పోగేసిన ఆయుధ సామగ్రి అలాగే ఉందని తెలిసింది. గాల్వాన్ నది వెంట ఉన్న ఆ ఆయుధ సామగ్రిపై భారత సైన్యం ఓ కన్నేసి ఉంచుతోంది.

యాప్స్ బ్యాన్‌తో చైనా కంపెనీలు వేల కోట్లు నష్టపోవడంతో చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దానికి తోడు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లఢక్ వెళ్లి అక్కడ గాయపడిన సైనికుల్ని ఓదార్చడంతో చైనాకి షాక్ తగిలినట్లైంది. ఇండియాతో పెట్టుకుంటే ఆర్థికంగా, అన్ని రకాలుగా డేంజరే అని భావించిన చైనా పాలకులు 48 గంటల్లో రకరకాలుగా భారత్‌తో సంప్రదింపులు, చర్చలు, మాటలు సాగించారు. చివరకు తోక ముడిచారు.

చైనా వెనక్కి తగ్గడానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని దేశాలు చైనాకి వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్‌తో యుద్ధం అంటూ జరిగితే చైనాకి మద్దతు ఇచ్చే దేశాలు పాకిస్థాన్, ఉత్తరకొరియా మాత్రమే. కానీ ఆ దేశాలు అంతంతమాత్రం. వాటి సాయంతో చైనా చేసేదేమీ లేదు. ఇవన్నీ ఆలోచించిన చైనా పాలకులు వాస్తవాన్ని గ్రహించారు. ఇండియా పైకి కనిపించేంత మెత్తటి దేశం కాదనీ తనతో పెట్టుకుంటే పోరాడటంలో శక్తిమంతమైన దేశమేనని చైనాకు తెలిసొచ్చింది. దీంతో వెనక్కు తగ్గింది. 

Tags:    

Similar News