జాతీయ జెండాకు అవమానం జరిగింది: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Update: 2021-01-29 11:22 GMT

జాతీయ జెండాకు అవమానం జరిగింది: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగం. 2020-21కి సంబంధించిన ఆర్థిక సర్వే సమర్పణతో తొలిరోజు సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అయితే రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరికేస్తూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అయితే ఎంతో పవిత్రమైన గణతంత్ర దినోత్సం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగిందని ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ అన్నారు. దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్‌ కూడా అడ్డుకోలేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేశామని రాష్ట్రపతి అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో మహిళల పాత్ర కీలకంగా మార్చామని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతుందన్నారు. తుఫాన్ల నుంచి బర్డ్‌ ఫ్లూ వరకు దేశానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని వాటిని దేశమంతా ఒకటిగా నిలిచి ఎదుర్కొందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొనియాడారు.

రైతుల సంక్షేమం కోసమే.. నూతన సాగు చట్టాలను తీసుకువచ్చామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అన్నారు. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు హక్కులు లభిస్తాయని చెప్పారు. విస్తృతచర్చల తర్వాతే కొత్త చట్టాలను పార్లమెంట్‌ ఆమోదించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నూతన చట్టాల అమలును నిలిపివేశామని అన్నారు. అయితే రిపబ్లిక్‌ డే రోజున దేశరాజధానిలో జాతీయజెండాకు అవమానం జరిగిందని రాష్ట్రపతి పార్లమెంట్్‌లో ప్రస్థావించారు.

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం 2020-21 ఆర్థిక సర్వేను ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు రుణాత్మకంగా ఉందని నిర్మాలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఒక్క ఇండియానే కాకుండా అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి -7.7 శాతంగా ఉందని, ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతంగా ఉండనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను ఫిబ్రవరి1కి వాయిదా వేశారు. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని టీం ఈ ఆర్థిక సర్వేను రూపొదించంది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సర కేంద్రబడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అందుకుముందు శనివారం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. 

Tags:    

Similar News