Karnataka Results 2023: యడ్యూరప్పను తొలగించి, బొమ్మైకి చాన్స్‌ ఇవ్వడమే శాపమైందా?

Karnataka Results 2023: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆశలపందిరి కుప్పకూలిపోయింది.

Update: 2023-05-13 15:45 GMT

Karnataka Results 2023: యడ్యూరప్పను తొలగించి, బొమ్మైకి చాన్స్‌ ఇవ్వడమే శాపమైందా?

Karnataka Results 2023: కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఆశలపందిరి కుప్పకూలిపోయింది. కమలనాధుల స్వప్నసౌధం దక్షిణద్వారం మూసుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరణశాసనమైతే కాంగ్రెస్ పునరుద్ధరణకు మంగళాశాసనంగా వినిపించాయి. హస్తినలో రాహుల్‌గాంధీ పట్టాభిషేకానికి మార్గం సుగమం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు ఘనవిజయం ప్రసాదించారు. వరస పరాజయాలతో నీరసించిన హస్తం పార్టీకి ఈ విజయం ఆక్సిజన్‌ అందించి ఉండొచ్చు. మరి, ఈ విజయాన్ని ఎవరికి ఆపాదించాలి.? జోడో యాత్ర అంటూ దేశమంతా తిరిగిన రాహుల్‌గాంధీదా... నాయనమ్మ చరిష్మాతో కన్నడ నాట సుడిగాలిలా తిరిగిన ప్రియాంకగాంధీకా?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను చూసో, ప్రియాంకగాంధీ చరిష్మాను చేసో, రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను చూసో కాంగ్రెస్ అభ్యర్థులను యోగ్యులుగా భావించో ఆ పార్టీని గెలిపించారని అనుకుంటే పొరపాటు. ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన యోగ్యతాపత్రంగా భావించాలి. అధికారపక్షం పూర్తిగా భ్రష్టుపట్టడం వల్ల కర్ణాటకలో విజయం వరించిందన్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంటే అది ఆరోగ్యప్రదమైన, నిర్మాణాత్మకమైన, వాస్తవికమైన వైఖరి. కర్ణాటక విజయాన్ని రాహుల్‌గాంధీకో, ప్రియాంకగాంధీకో ఆపాదించడం ఎంత పొరపాటో, అపజయాన్ని కమలం పార్టీ ఖాతాలో జమకట్టడం కూడా అంతే తొందరపాటు. కానీ చాలాకాలంగా పరాజయాలతో నీరసించిన కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక గెలుపు ఒక శుభవార్త. ఒక మంచి పరిణామం. ఒక ముందుడుగు. వరుస పరాజయాలు చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీకి కర్ణాటక విజయం బలవర్థకమైన ఔషధం. అంతకుమించిన ఆక్సిజన్‌.

కర్ణాటకలో టెక్నికల్‌గా కాంగ్రెస్ విజయం సాధించడం అని చెప్పడం కంటే బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పడమే బెటరేమో. జరిగినవి శాసనసభ ఎన్నికలు కనుక స్థానిక అంశాలకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారని కూడా భావించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్ధానపతనాలను చవి చూస్తున్నా... ఎంతగా అప్రతిష్ఠపాలైనా.. కర్ణాటకలో బీజేపీకి వదిలించుకొని కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఏదో ఒక ప్రాంతీయ పార్టీని కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం అందించి కర్ణాటక ఓటర్లు విజ్ఞత ప్రదర్శించారు. అలా అస్థిరతతో, అవినీతితో విసిగివేసారిన కర్ణాటక ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారు.

కర్ణాటక పరిణామాలను సమీక్షించుకుంటుంది బీజేపీ. అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించి, అవినీతి ఆరోపణల కారణంగా యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి, ఆ ప్లేస్‌లో బస్వరాజ్‌ బొమ్మైకి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంలో బీజేపీ కేంద్ర నాయకత్వం పాత్ర ఏమిటో, ఆ పార్టీ కర్ణాటక నాయకులు పాత్ర ఏమిటో ఆత్మవంచన లేకుండా పరిశీలించుకోవాలి. బయటకు బాగానే ఉన్నా... యడ్యూరప్ప, బొమ్మై వర్గాల వైరం ఈ పతనానికి ఎంత కారణభూతమో కూడా సమీక్షించుకోవాలి. నీతిగా ఉండాలను కోవడం వేరు. ఎన్నికలలో గెలుపొందడం వేరు. అవినీతిని న్యాయాస్థానాల విచారణకు వదిలిపెట్టి యడ్యూరప్పను కొనసాగించి ఉంటే, సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల వ్యూహరచన చేసుకొని ఉంటే ఫలితాలు ఇంత దారుణంగా ఉండేవి కావన్ని పొలిటికల్‌ పండితుల మాట.

ఇక, కాంగ్రెస్. జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలని కంటున్న కలలు సాకారం కావాలంటే, సర్కార్‌ను నెలకొల్పాలంటే, దానికి రాహుల్ నాయకత్వం వహించాలంటే కర్ణాటక విజయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఈ గెలుపును భవిష్యత్తు నిర్మాణానికి ఎట్లా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. కర్ణాటక కొత్త అసెంబ్లీలో స్పష్టమైన ఆధిక్యం లభించింది కాబట్టి... మరో పార్టీతో పొత్తు పెట్టుపెట్టుకోవలసిన అవసరం కానీ, మరో పార్టీ షరతులకు తలొగ్గవలసిన అగత్యం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అంత మాత్రాన వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ప్రభావం చూపించగలమనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే, ఎంతలేదన్న లోక్‌సభ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉంది. ఈ సంవత్సరం కాలం అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ ఎంతోకొంత మసకబారడం సహజం. అది కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీకైనా సహజం ఎదురయ్యే వ్యతిరేకతే. అదే గనుక జరిగితే, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలన్న సంకల్పం నెరవేరకపోవచ్చు. అందుకే, కర్ణాటక విజయంతో పార్టీ ప్రతిష్ఠను పెంచుకోవడం ఎట్లాగో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచించాలి. ఈ దిశగా పార్టీ తీసుకునే తొలి నిర్ణయం అత్యంత కీలకమైనది కాబట్టి.

అదే, ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్నది. ఇదే ఆ కీలక నిర్ణయం. ఈ పదవిని ఆశిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎటూ రేసులో తానున్నాంటున్నారు. ఇదే సందర్భంలో విజయం తర్వాత డీకే మీడియా ముందుకు వచ్చారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. అధిష్టానం తనకు నమ్మకం ఉందంటూ, తాను సీఎం రేసులో ఉన్నానన్న సంకేతాన్ని అత్యంత బలంగా పంపారు. ఇక సిద్దరామయ్య చాలా బలమైన నాయకుడే. ఈయన ఎన్నికలలో గెలుపొందారు. శాసనసభ్యులలో ప్రాబల్యం ఉండటంతో పాటు మంచి వక్తగా, పరిపాలనాదక్షుడుగా పేరు ఉన్నవాడు సిద్దరామయ్య. సమర్థుడైన పాలకుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ముఖ్యమంత్రి నియామకం తర్వాత మంత్రులుగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ప్రధానం. అవినీతి మాలిన్యం అంటనివారికి అవకాశం ఇస్తే మొత్తం మంత్రివర్గానికి శోభ సమకూరుతుంది.

అంతేకాదు, కొత్త ప్రభుత్వం పనితీరుపైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎన్నికల వాగ్దానాలలో కొన్నింటినైనా అమలు చేయగలిగి, సంక్షేమ కార్యక్రమాలను నిజాయతీగా అమలు చేసి మంచి ఫలితాలు సాధించగలిగితే పార్టీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఎవరిపైన అయినా అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే చర్య తీసుకోవాలి. బీజేపీ నాయకులతో అవినీతి సొమ్మును కక్కిస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ఈ అంశాన్ని అమలు చేసే క్రమంలో కక్షసాధిస్తున్నదనే అపకీర్తిని అధికార కాంగ్రెస్ మూటకట్టుకోకూడదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా ఫలితాలు సాధించగలిగితే రాహుల్ నాయకత్వం బలపడుతుంది. దాని ప్రభావం పలు రాష్ట్రాల్లో త్వరగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైన ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం కావడంపైనా కర్ణాటక ప్రభావం ఉంటుంది. అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ప్రభావశీలమైనవి. ఇక నుంచి ఆ రాష్ట్రంలో కాంగెస్ ప్రభుత్వం సాగించే పరిపాలన తీరుతెన్నుల ప్రభావం సైతం 2024 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జయాపజయాలపైన ఉండబోతున్న విషయాన్ని అధిష్టానం పెద్దలు గ్రహించాలి. 

Tags:    

Similar News