Amar Jyoti: ఇక "అమర్ జవాన్ జ్యోతి" కనిపించదు..

Amar Jyoti: ఢిల్లీలోని ఇండియా గేట్‌లోని అమరజ్యోతిని ఆర్మీ అధికారులు తరలించారు.

Update: 2022-01-21 11:47 GMT

Amar Jyoti: ఇక "అమర్ జవాన్ జ్యోతి" కనిపించదు..

Amar Jyoti: ఢిల్లీలోని ఇండియా గేట్‌లోని అమరజ్యోతిని ఆర్మీ అధికారులు తరలించారు. పాకిస్థాన్‌ యుద్ధంలో అమరులైన 3వేల 843 మంది సైనికులకు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ అమర జ్యోతి నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ జ్యోతిలో కలిసిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేటులోని అమర జవాన్ల జ్యోతిని 400 మీటర్ల దూరంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకం జ్యోతిలో కలిపేశారు.

ఇండియా గేట్‌లోని అమర జవాన్ల జ్యోతి, నేషనల్ వార్‌ మెమోరియల్‌లో జ్యోతిని వేర్వేరుగా నిర్విరామంగా వెలిగించడం కష్టమని కేంద్ర అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో అమర జవాన్ల జ్యోతిని వార్‌ మెమోరియల్‌ జ్యోతిలో కలపాలని కేంద్రం నిర్ణయించింది. ఆమేరకు మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు అమర జవాన్లకు నివాళులర్పించి జ్యోతిని అర్మీ తరలించింది. నేషనల్‌ వార్ మెమోరియల్‌లోని జ్యోతిలో అమరజ్యోతిని కలిపేసింది.

అమరజ్యోతి తరలింపుపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. చారిత్రక నేపథ్యమున్న ఇండియాగేట్‌లోని అమర జవాన్ల జ్యోతిని తరలించడంపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇది ఎంతో బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి అమరుల త్యాగాలు తెలియవని ట్విటర్‌లో పేర్కొన్నారు. అమరజ్యోతిని ఆర్పడమంటే పాకిస్థాన్‌ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన 3వేల 843 మంది వీరుల చరిత్రను తుడిచిపెట్టడమేనని కాంగ్రెస్‌ నాయకుడు మనీష్‌ తివారీ ట్వీట్‌ చేశారు.

అమరజ్యోతి తరలింపుతో ఖాళీ ఏర్పడిన ఆ ప్రదేశాన్ని స్వతంత్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. 28 అడుగుల ఎత్తులో బోస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ట్విటర్‌లో తెలిపారు. ఈనెల 23న నేతాజీ జయంతి వేడుకల్లో విగ్రహా హోలోగ్రామ్‌ను ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News