Top 6 News @ 6PM: పోలీసుల అదుపులో పవన్ కళ్యాణ్ ను బెదిరించిన వ్యక్తి: మరో 5 ముఖ్యాంశాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) ను చంపేస్తామని బెదిరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
Top 6 News @ 6PM: పోలీసుల అదుపులో పవన్ కళ్యాణ్ ను బెదిరించిన వ్యక్తి: మరో 5 ముఖ్యాంశాలు
1. గన్ మెన్లు ఇవ్వాలి: శివధర్ రెడ్డిని కోరిన మంచు మనోజ్
తమకు గన్ మెన్లను ఇవ్వాలని తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కోరారు మంచ్ మనోజ్ (manchu manoj), ఆయన భార్య మౌనిక (Manchu Mounika). మంగళవారం సాయంత్రం ఇంటలిజెన్స్ బాస్ ను ఆయన కార్యాలయంలో మనోజ్ కలిశారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను మనోజ్ వివరించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ డీజీపి జితేంద్ర ను కలిసి ఫిర్యాదు చేశారు. మంచు మోహన్ బాబు (manchu mohanbabu) కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని మనోజ్ డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వెంటనే మోహన్ బాబు కూడా రాచకొండ సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. తనకు మనోజ్, మౌనిక ల నుంచి ప్రాణభయం ఉందని ఆ ఫిర్యాదులో తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి మంచు విష్ణు ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు.
2. పోలీసుల అదుపులో పవన్ కళ్యాణ్ ను బెదిరించిన వ్యక్తి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) ను చంపేస్తామని బెదిరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పేషీకి డిసెంబర్ 9న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. బెదిరింపులకు దిగిన వ్యక్తి నూక మల్లికార్జునరావుగా గుర్తించారు. పవన్ కళ్యాణ్ పేషీకి 95055 05556 నెంబర్ నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని పోలీసులు ట్రేస్ చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్టు తేల్చారు.
3. ఆశా వర్కర్లపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్
ఆశా వర్కర్లపై చేయి చేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను ఆయన మంగళవారం పరామర్శించారు. ఆశా వర్కర్లపై పోలీసులు చేయిచేసుకున్న అంశంపై మహిళా కమిషన్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన చెప్పారు.
4. రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాసం
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పై ఇండియా కూటమి మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పక్షపాతంగా రాజ్యసభ ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి ఆరోపణలు చేసింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా కూటమి ఎంపీలు మద్దతిచ్చాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారని కాంగ్రెస్ నాయకురాలు రణజీత్ రంజన్ ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.
5. ట్రంప్ కార్యవర్గంలో భారతీయ అమెరికన్ హర్మీత్ కు చోటు
డోనల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో భారత సంతతికి చెందిన హర్మీత్ కె. థిల్లాస్ ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా నామినేట్ చేశారు. హర్మిత్ పౌర హక్కులను కాపాడేందుకు ఎంతో కృషి చేశారని ట్రంప్ చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రార్థనలు చేయకుండా అడ్డుకోవడంపై ఆమె న్యాయపోరాటం చేసిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. హర్మీత్ కె. థిల్లాన్ ఇండియాలోని చండీగఢ్ లో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆ కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. డార్ట్ మౌత్ కాలేజీలో క్లాసికల్ లిటరేచర్ లో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె వర్జీనియా యూనివర్శిటీలో లా చదివారు.
6. చంద్రబాబుతో వంగవీటి రాధ భేటి
ఏపీ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ మంగళవారం సమావేశమయ్యారు. ఆరేళ్లుగా వంగవీటి రాధ టీడీపీలో ఉంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాధ వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్ధుల ప్రచారం కోసం ప్రచారం చేశారు. రాధ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకొని మంత్రి లోకేష్ రాధను ఇంటికెళ్లి పరామర్శించారు. రాష్ట్రంలో నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ తరుణంలో రాధ చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధకు నామినేటేడ్ పదవి దక్కే అవకాశం ఉందని ఆయన అనుచరుల్లో ప్రచారంలో ఉంది.