NTR : ఎన్టీఆర్ పేరు వాడితే జైలుకే..తస్మాత్ జాగ్రత్త ..!

నందమూరి తారక రామారావు ... ఈ పేరు వింటేనే మాస్ పరవశించిపోతుంది.

Update: 2026-01-29 12:35 GMT

NTR : ఎన్టీఆర్ పేరు వాడితే జైలుకే..తస్మాత్ జాగ్రత్త ..!

నందమూరి తారక రామారావు ... ఈ పేరు వింటేనే మాస్ పరవశించిపోతుంది. దశాబ్దాల కష్టం, అంకితభావంతో ఆయన సంపాదించుకున్న గుర్తింపును, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇకపై ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరును ప్రస్తావించినా, ఆయన రూపాన్ని వాడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

కోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఒక వ్యక్తి పేరు, రూపం , ఇమేజ్ అనేవి కేవలం సినిమాకు సంబంధించినవి కావు. అవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 , 21 ప్రకారం లభించే జీవించే హక్కు, స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది.

“ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” అనే పేర్లతో పాటు అభిమానులు ప్రేమగా పిలుచుకునే “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” అనే బిరుదులు కూడా ఆయన సొంతం. వీటిని వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధం. కాపీరైట్ చట్టం 1957 , ట్రేడ్‌మార్క్ చట్టం 1999 కింద ఎన్టీఆర్ ఇమేజ్‌కు పూర్తి రక్షణ కల్పించబడింది.

డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకుని కొందరు చేస్తున్న ఆగడాలకు కోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.ఎన్టీఆర్ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మార్ఫ్ చేసినా, అభ్యంతరకరంగా మార్చినా కఠిన చర్యలు ఉంటాయి.సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులు ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగిస్తూ చేసే పోస్ట్‌లను తక్షణమే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సంస్థలు 2021 ఐటీ రూల్స్ ప్రకారం ఎన్టీఆర్ హక్కులను ఉల్లంఘించే లింక్‌లను వెంటనే తొలగించాలి.

నందమూరి తారక రామారావు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, భారతదేశం గర్వించదగ్గ గొప్ప సెలబ్రిటీ అని ఢిల్లీ హైకోర్టు కొనియాడింది. ఎన్నో ఏళ్ల కృషి తర్వాత ఆయన ఈ స్థాయిని అందుకున్నారని, ప్రజల మనసుల్లో ఆయన రూపం చెరగని ముద్ర వేసిందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఆయన వ్యక్తిత్వ హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ బాధ్యతగా పేర్కొంది. ఈ తీర్పుతో ఎన్టీఆర్ చుట్టూ ఒక పటిష్టమైన న్యాయపరమైన రక్షణ ఏర్పడింది. ఎవరైనా ఆయన పేరును లేదా ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే, వారు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే.

Tags:    

Similar News