మెగాస్టార్ చిరంజీవి.. వేగం పెంచుతున్నారు. చారిత్రాత్మక సైరా సినిమా షూటింగ్ పూర్తి అయిపొయింది. ఈ భారీ సినిమా నిర్మాణానికి ఎక్కువ రోజులు సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సైరా పూర్తి కావడంతో తరువాతి సినిమాలపై దృష్టి పెట్టారు. కొరటాల దర్శకత్వంలో తరువాతి సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇటీవల మెగాస్టార్ ప్రత్యేకంగా స్లిమ్ గా తయారవడానికి విశాఖ వెళ్లి వచ్చారు కూడా.
దిల్ రాజు.. నిర్మాతగా ఈ పేరు తెలీని ప్రేక్షకుడు లేదంటే అతిశయోక్తి కాబోదు. డిస్ట్రిబ్యూటర్ గా సినిమా ప్రస్థానాన్ని మొదలు పెట్టి, నిర్మాతగా ఎదిగి.. పెద్ద నిర్మాతల్లో ఒకరిగా వెలుగుతున్నారు. ఈయన పట్టిందల్లా బంగారమే అంటారు. ఈయనకు ఒక కోరిక మిగిలిపోయిందట. బాలకృష్ణ, చిరంజీవిలతో సినిమా తీయాలన్నదే ఆ కోరిక.
ఇప్పుడు చిరంజీవి 153 వ సినిమా తాను నిర్మించాలని అనుకుంటున్నట్టు చిరంజీవికి చెప్పారట దిల్ రాజు. దానికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
కొరటాల సినిమా మొదలైన తరువాత ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు కావచ్చని టాక్. సో, చిరంజీవి 153 సినిమాకి నిర్మాత ఫిక్స్ అయినట్టే.. కానీ, ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ఎవరూ వెల్లడించలేదు.