Krishna Vamsi: 'ఖడ్గం'లో ఆ హీరో ఉండాల్సింది.. కానీ కృష్ణవంశీ ఎందుకు వద్దన్నారు?
Krishna Vamsi: దర్శకుడు కృష్ణవంశీ తన క్లాసిక్ చిత్రాలైన 'మురారి', 'ఖడ్గం' సినిమాల కాస్టింగ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.
Krishna Vamsi: 'ఖడ్గం'లో ఆ హీరో ఉండాల్సింది.. కానీ కృష్ణవంశీ ఎందుకు వద్దన్నారు?
Krishna Vamsi: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన సినిమాల్లో పాత్రల ఎంపిక విషయంలో ఎంత పక్కాగా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాలైన 'మురారి', 'ఖడ్గం' సినిమాల కాస్టింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మురారిలో సోనాలి బింద్రే పాత్ర వెనుక..
మహేష్ బాబు హీరోగా నటించిన 'మురారి' చిత్రంలో సోనాలి బింద్రే పాత్ర గురించి కృష్ణవంశీ స్పందిస్తూ.. ఆమె చాలా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. "ఆ సమయంలో సోనాలి చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగార్జునతో కూడా చర్చలు జరుగుతున్నాయి. మురారిలో ఆమె పాత్ర కేవలం ఆరు, ఏడు రోజుల పని మాత్రమే. ఒక పాట, ఆ తర్వాత చనిపోయే పాత్ర. కానీ ఆ పాత్రలోని ఇంటెన్సిటీ చెప్పగానే ఆమె వెంటనే 'సరే ఓకే, వచ్చేస్తున్నాను' అని అంగీకరించారు" అని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు.
ఖడ్గం: నాగార్జున వద్దు.. శ్రీకాంత్ ముద్దు!
దేశభక్తి నేపథ్యంలో వచ్చిన 'ఖడ్గం' సినిమా కాస్టింగ్ విషయంలో ఒక పెద్ద చర్చ జరిగినట్లు కృష్ణవంశీ వెల్లడించారు.శ్రీకాంత్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం నాగార్జునను తీసుకోవాలని నిర్మాతలు భావించారు. స్టార్ హీరో ఉంటే బడ్జెట్ బాగా వస్తుందని వారి ఆలోచన. అయితే కృష్ణవంశీ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. నాగార్జున వంటి పెద్ద స్టార్ వస్తే సినిమా బడ్జెట్ భారీగా పెరుగుతుందని, పైగా సినిమాలో ఉన్న ఇతర ముఖ్య పాత్రల (రవితేజ, ప్రకాష్ రాజ్) ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉందని ఆయన వివరించారు.
ఒక పాత్ర హీరోలా, మరో పాత్ర స్నేహితుడిలా కనిపించకూడదని.. అందరికీ సమాన ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతోనే నాగార్జునను కాకుండా శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్లు కృష్ణవంశీ స్పష్టం చేశారు. నాగార్జున సినిమాలపై ఉండే భారీ అంచనాలను 'ఖడ్గం' వంటి కథతో రీచ్ అవ్వడం కష్టమని ఆయన భావించారు.
కేవలం బడ్జెట్ మరియు పాత్రల సమతుల్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది పెద్ద సమస్యేమీ కాదని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి కృష్ణవంశీ తీసుకున్న ఆనాటి నిర్ణయాలే ఆ సినిమాలను క్లాసిక్స్‌గా మార్చాయని చెప్పక తప్పదు.