KJ Yesudas Birthday : ఆయన పాటకు భగవంతుడూ దాసుడే!

Update: 2020-01-10 09:24 GMT
KJ Yesudas (file photos)

ఒక గాయకుడి పాటను ఆలయంలో దేవుని నిద్రపుచ్చడానికి వినిపిస్తారంటే నమ్మగలరా? ఒక గాయకుడు ఐదు దశాబ్దాల పాటు తన పాటల ప్రయాణాన్ని కొనసాగించి..ఇంకా ముందుకు సాగుతున్నాడంటే ఆశ్చర్యపడకుండా ఉండగలరా? తన మాతృభాషతో పాటు ఇరుగు పొరుగు భాషల్లోనే కాకుండా ప్రపంచ భాషల్లోనూ పాటలు పాడి అభిమానందనం సంపాదించుకున్నారంటే ఆయన ఎవరనేది తెలుసుకోకుండా ఆగగలరా? ఆగలేరు.. అందుకే ఆయన గురించి ఇదిగో మీకోసం!

ఆ మధుర గాయకుడు 'కట్టస్సేరి జోసెఫ్ యేసుదాసు'.. ఇలా అంటే కొంచెం గుర్తుపట్టలేరు కానీ, ఆయన 'జేసుదాసు'. చూశారా ఎలా గుర్తుపట్టారో. ఆయన పుట్టినరోజు ఈరోజు (జనవరి 10). ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పుకోవడం అంటే పాటలలో ఉండే వైవిధ్యం గురించి తెలుసుకోవడమే. జేసుదాసును పరిచయం చేయడం అంటే స్వామి అయ్యప్ప గురించి మాలధారులకు చెప్పే సాహసం లాంటిది.

అవును. పాటల ప్రేమికులకు జేసుదాసుగా మారిపోయిన ఏసుదాసు పాట భక్తులను భగవంతునితో అనుసంధానం చేస్తుంది. ప్రేమికులను ముని వేళ్ళమీద నిలబెట్టి ప్రేమపాఠాలు చెబుతుంది. స్నేహితులకు సంతోష సంబరాల అంబరాలను చూపిస్తుంది. అమ్మ ఒడిలో వెచ్చదనాన్ని.. నాన్న లాలింపులోని కమ్మదనాన్ని ఒక్కసారే కల్సి మనసును చుట్టేసేలా చేస్తుంది. ప్రకృతిలోని ప్రతి అంశమూ ఆ పాటతో తన్మయత్వాన్ని పొందుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే వర్ణనకు అంతే దొరకదు.

ఒక లాలి పాట.. ఒక జోలపాట.. ఇటు ఆధ్యాత్మిక గానం.. అటు విరహ గీతం .. ఒకవైపు సంగీత ఝరి.. మరోవైపు సినీ సంగీతపు పాటల జడి ఇన్ని వైవిధ్యాలూ ఆ గొంతులో సరిసమానంగా పలుకుతాయి. ఆయన పాత వింటే సంగీతం కూడా తాను ఆ పాట కంటే తక్కువే అనుకుంటూ మౌనిస్తుంది.

ఇంత గొప్ప గాయకుడి పాటలు వినగలిగిన అవకాశం దొరికిన మనం అదృష్టవంతులం. ఆయన మళయాళ మాతృభాష అయినా తెలుగు, హిందీ, తమిళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ లాంటి దేశ భాషలతో పాటు అరబిక్‌, ఇంగ్లీష్‌, లాటిన్‌, రష్యన్‌ భాషల్లో కలిసి దాదాపు 80 వేల పాటలు పాడారు. ఇక ఆయన పాటలను దూరం నుంచి వినడం కాదు.. ఆయనతో పాటూ ఉండిపోతే నిత్యం ఆ గాత్రంలో మైమర్చిపోవచ్చని ఏకంగా ఎనిమిది జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి. అవేనా ఆ అదృష్టానికి నోచుకున్నాయి మేమూ ఉన్నామంటూ పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ లాంటి అవార్డులు ఆయన వద్దకు వచ్చి వాలిపోయాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే ఆయన పాడిన 'హరిహరాసరం' పాట విశిష్టత మరో ఎత్తు. ఈ పాటను శబరిమలలో అయ్యప్ప స్వామికి ప్రతిరోజూ పవళింపు సేవలో వినిపిస్తారు. దేవుడినే ప్రశాంతంగా నిద్రబుచ్చగలిగే ఈ ఒక్క పాట గురించి చెబితే చాలు కదాండీ ఆయన గాత్రం గొప్పదనాన్ని చెప్పడానికి.

ఇన్నీ చెప్పిన తరువాత ఆయన గానామృతాల్ని ఒక్కసారి కొన్నైనా వినకపోతే ఆయన పుట్టినరోజు సంబరం తీరదు కదా.. అందుకే కొన్ని ఆణిముత్యాలు మీకోసం...   

Full View

Full View

Full View

Full View

Full View



Tags:    

Similar News