Actress Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. హీరోయిన్ కు రూ.103కోట్ల జరిమానా
Actress Ranya Rao: సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలో అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం అరుదుగా జరిగే విషయమే.
Actress Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. హీరోయిన్ కు రూ.103కోట్ల జరిమానా
Actress Ranya Rao: సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలో అక్రమ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం అరుదుగా జరిగే విషయమే. అయినా అది జరిగినప్పుడు మాత్రం సంచలనం సృష్టిస్తుంది. కన్నడ నటి రన్యా రావు అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో ఇరుక్కున్నారు. దేశాన్ని, అధికారులను మోసం చేసి విదేశాల నుండి భారీ మొత్తంలో బంగారం తీసుకురావడానికి ప్రయత్నించిన ఆమెకు ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ షాక్ ఇచ్చింది. ఆమెపై విధించిన భారీ జరిమానా, కేసు నమోదు చేసింది.
కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశాల నుంచి అక్రమంగా వందల కోట్ల విలువైన బంగారాన్ని భారతదేశానికి తీసుకువచ్చినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ అనంతరం ఆమె స్మగ్లింగ్ చేసిందని ధృవీకరించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రన్యా రావుకు భారీ షాక్ ఇచ్చింది.
డీఆర్ఐ అధికారులు రన్యా రావుకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధించారు. ఈ నోటీసును సెప్టెంబర్ 2న జైలులో ఉన్న రన్యాతో పాటు కేసులోని మిగతా నలుగురు నిందితులకు అందజేశారు. గత మార్చి 4న డిఆర్ఐ అధికారులు 127.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, రన్యా రావును అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ చేసిన వస్తువుల విలువను ఆరు నెలల్లోగా వసూలు చేయాలని డిఆర్ఐ నియమాలు చెబుతున్నాయి, ఈ నేపథ్యంలో అధికారులు వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
రన్యా రావుతో పాటు ఈ కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారు. వారిపై కూడా డిఆర్ఐ భారీ జరిమానాలు విధించింది. 67.6 కిలోల బంగారం స్మగ్లింగ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో తరుణ్ కొండూరు రాజుకు రూ.62 కోట్ల జరిమానా విధించారు. సాహిల్ జైల్, భరత్ జైన్ ఈ ఇద్దరూ తలా 63.61 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు తేలడంతో వారికి చెరి రూ.53 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
ఈ భారీ జరిమానాలను నిందితులు చెల్లించకపోతే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం డిఆర్ఐ అధికారులకు ఉంది. జరిమానాతో పాటు, నిందితులపై క్రిమినల్ కేసులు కూడా కొనసాగుతాయి. ఈ కేసుకు సంబంధించిన 2,500 పేజీల డాక్యుమెంట్లు, నోటీసులను నిందితులకు అందజేశారు. మంగళవారం హైకోర్టులో కాఫీపోసా(COFEPOSA) అప్లికేషన్ కూడా విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా పడింది. మొత్తానికి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారికి చట్టం ద్వారా సరైన శిక్ష పడుతుందని ఈ కేసు మరోసారి రుజువు చేసింది.