వైల్డ్ కార్డ్ గా తమన్నా ఎంట్రీ.. వస్తూనే గ్రూప్ కట్టే ప్రయత్నం.. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం.. వితికాకి నామినేషన్ ఛాన్స్ మిస్ కావడం.. బాబా భాస్కర్ నేనెవరినీ నామినేట్ చేయలేనని చెప్పడం.. ఆఖరుకు నామినేషన్ చేయడం.. ఇలా బిగ్‌బాస్ ఎపిసోడ్ 9 ప్రత్యేకంగా నడిచింది.
వస్తూనే..
హేమను ఆదివారం షో నుంచి బయటకు పంపిస్తూనే బిగ్‌బాస్ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రిని వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ చేసాడు. అయితే, హౌస్ లోకి ఆమె సోమవారం ఎంటర్ అయ్యారు. వస్తూనే ఆమె వరుణ్, వితికలను టార్గెట్ చేశారు. మెల్లగా తనకంటూ గ్రూప్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు తమన్నా. మొదట మహేష్ తో గత వారంలో వరుణ్ తో జరిగిన గొడవలో నీ తప్పేంలేదు సారీ ఎందుకు చెప్పావంటూ అతనిని అడ్డు పెట్టుకుని మహేష్ ని సపోర్ట్ చేసే వాళ్లందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం స్పష్టంగా చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తనకు ఉన్న ఎడ్వాంటేజ్ ని బాగా ఉపయోగించుకున్నారు తమన్నా. ఇక ఎలిమినేషన్స్ కి ఇద్దరి పేర్లు నామినేట్ చేయాల్సిన సందర్భంలో కూడా ఆమె వితిక, వరుణ్ ల పేర్లే చెప్పడం ఆమె గేమ్ ప్లాన్ ఎలా వుండబోతోందో తెలియచెప్పింది.
నామినేషన్ ప్రక్రియ ఇలా..
ఇక సోమవారం బిగ్‌బాస్ హౌస్ లో ఈవారం ఎలిమినేట్ చేయాల్సిన హౌస్ మెట్ ను నామినేట్ చేసే ప్రక్రియ జరిగింది. ఒక్కోరు ఇద్దరు హౌస్ మెట్ ల పేర్లు బిగ్‌బాస్ కు చెప్పాలి. దీనిలో భాగంగా హిమజ- పునర్నవి, రాహుల్ లను నామినేట్ చేసింది. అదేవిధంగా వరుణ్ - జాఫర్, శ్రీముఖి లను, జాఫర్ - వితిక, మహేష్ పేర్లను, రోహిణి- పునర్నవి,మహేష్ లను, మహేష్- వితికా, వరుణ్ లను, శ్రీముఖి- హిమజ, మహేష్ పేర్లను, పునర్నవి- హిమజ, శ్రీముఖి లను, తమన్నా- వరుణ్ సందేశ్, వితిక లను నామినేట్ చేస్తున్నట్టు బిగ్‌బాస్ కు చెప్పారు.
బాబా టెన్షన్..
నామినేషన్స్ కి ఇద్దరి పేర్లను బిగ్‌బాస్ కి చెప్పాల్సిన తప్పని పరిస్థితిలో బాబా భాస్కర్ తనేవరినీ చెప్పలేనని బిగ్‌బాస్ కు చెప్పాడు. అవసరం అయితే, తనపేరు నామినేట్ చేయండి కానీ, ఒక్క వారం రోజుల పరిచయంతో ఎవరు ఏమిటో తానెలా చెప్పగలను అని బిగ్‌బాస్ ను అడిగాడు. అయితే, ఇది అందరికీ తప్పనిసరి నిర్ణయమని బిగ్‌బాస్ చెప్పాడు. అయినా బాబా భాస్కర్ తనవల్ల కాదని చెప్పడంతో, బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కి రెండు ఆప్షన్ లు ఇచ్చాడు. బాబా భాస్కర్ ను ఒక్కడ్నే నామినేట్ చేయడం లేదా హౌస్ మేట్స్ అందరూ నామినీలుగా ఉండడం ఆ ఆప్షన్స్. దానికి హౌస్ మేట్స్ అందరూ కల్సి.. అందర్నీ ఎలిమినేషన్ లో పెట్టాలని బిగ్‌బాస్ కు చెప్పడానికి సిద్ధం అయ్యారు. దీంతో బాబా భాస్కర్ నా ఒక్కడి కోసం అందరూ ఇలా చేయొద్దని వారించాడు. చివరికి తనకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో చెబుతున్ననంటూ వితిక, రాహుల్ పేర్లను చెప్పాడు. అలా నామినేషన్ ప్రక్రియ ముగిసింది.
చివరకు శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా షెరు, పునర్నవి భూపాలం, రాహుల్ మొత్తం 8 మంది నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు.
పాపం వితిక..
నామినేషన్ ప్రక్రియ గురించి ఎవరూ చర్చించ వద్దని ముందే బిగ్‌బాస్ హెచ్చరించాడు. అయితే, వితిక తన భర్త వరుణ్ తో చెవిలో ఎదో చెప్పడం.. దానికి వరుణ్ రెండోదే అని అనడం కొంత సేపు గుసగుసలు ఆడుకోవడం కనిపించింది. దీంతో బిగ్‌బాస్ వితికను హెచ్చరించి.. నామినేషన్ ప్రక్రియలో ఓటింగ్ లేకుండా చేశాడు. మేమేమీ మాట్లాడుకోలేదు అని వరుణ్-వితిక లు చెబుతున్నా బిగ్‌బాస్ వినలేదు. వితికకు ఎవర్నీ నామినేట్ చేసే అవకాశం దక్కలేదు.
ఎపిసోడ్ 9 ఎలా వుందంటే..
ముందే చెప్పినట్టు ఈ ఎపిసోడ్ లో రెండు ప్రముఖ అంశాలు. ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. రెండు నామినేషన్స్. మొదటి విషయంలో తమన్నా ముందుగానే బాగా గేమ్ కోసం సిద్ధమై వచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా తన మొదటి టార్గెట్ లుగా వితిక, వరుణ్ లను ఎంచుకున్నట్టు స్పష్టంగా తెలిసింది. అదే పంథాలో హౌస్ మేట్స్ లో ఎవరెవరికి వారితో సమస్య వుందో వారిని ఒక్క తాటిపైకి తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక నామినేషన్ ప్రక్రియలో వితిక,వరుణ్ గుసగుసలు.. దానికి బిగ్‌బాస్ వార్నింగ్ ఒక డ్రామా క్రియేట్ చేశాయి. తరువాత వరుణ్ తాము నామినేషన్ ల గురించి మాట్లాడుకోలేదనీ తమన్నా గురించి మాట్లాడుకున్నామనీ చెప్పాడు. ఇక బాబా భాస్కర్ ఎవరినీ నామినేట్ చేయలేనని చెప్పడం ఆ సందర్భంగా ఈ రూల్ బాలేదని బిగ్‌బాస్ కు స్పష్టం చేయడం అతని నిజాయతీని చెప్పాయి. కానీ, బిగ్‌బాస్ లో నిజాయతీతో ఆడే గేమ్ విజయాన్ని ఇవ్వడం కష్టమే. కొంత నాటకీయంగా కూడా నామినేషన్ ప్రక్రియలో బాబా ఎపిసోడ్ కనిపించింది.
మొత్తమ్మీద రెండోవారం మొదటి రోజు కొత్తరకం ఆటకి తెరతీసింది.