Lifestyle: పేపర్ కప్స్‌లో టీ తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Side effects using paper cups: చాలా మందికి పేపర్ కప్స్‌లో టీ తాగే అలవాటు ఉంటుంది. టీ లేకపోతే రోజు గడవని వారు ఎంతో మంది ఉంటారు. రోజుకు మూడు నుంచి నాలుగు టీలు కూడా తాగే వారు ఉంటారు. అయితే ఇటీవల పేపర్ కప్స్ ట్రెండ్ బాగా పెరిగింది. బయట టీ కొట్టుల్లో మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా చిన్న చిన్న శుభకార్యాలకు పేపర్ టీ కప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు ప్లాస్టిక్ కప్స్ ఉన్న స్థానంలో ఇప్పుడు పేపర్ కప్స్ ఉపయోగం పెరిగింది.
పేపర్ కప్స్‌లో టీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలా మంది భావిస్తుంటారు. అయితే వాస్తవం మాత్రం దానికి విరుద్దమని నిపుణులు చెబుతున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు. డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం అంటే స్లో పాయిజన్ తాగినట్లే అని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ గ్లాసుల్లో టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ కప్పులో టీ పోస్తే కాగితం తడవకుండా ఉండేందుకు కాగితం కప్పులో సన్నని ఒక పొరను వేస్తారు. అయితే ఆ సన్నని పొర ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దీనినే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వేడి వేడి టీ లేదా కాఫీ పోసినప్పుడు ఆ మైక్రోప్లాస్టిక్ నుంచి చిన్న కణాలు బయటకు వస్తాయి. ఇది టీలో కలిసి పోతుంది. అలాంటి టీని తీసుకుంటే నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఇది క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
పేపర్ కప్పులో ఉండే మైక్రోప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒక అధ్యయనం ప్రకారం, ఒక పేపర్ కప్పులో సుమారుగా 20,000 నుంచి 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయి. ఇది మీ శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్‌కు కారణమవుతుంది. అదే సమయంలో ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేపర్ కప్ మాటున దాగి ఉన్న మైక్రోప్లాస్టిక్స్ గురించి తెలియక చాలామంది పేపర్ కప్స్‌లో టీ తాగుతున్నారనే చేదు నిజాన్ని ఈ అధ్యయనం బయటపెట్టింది.