Loneliness: ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు.. మన అలవాట్లే..!
Loneliness: ఒంటరితనానికి అసలు కారణం ఇతరులు కాదని, మన ఆలోచనలు, అలవాట్లేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనం తగ్గాలంటే చేయాల్సిన మార్గాలు ఇవే.
Loneliness: ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు.. మన అలవాట్లే..!
Loneliness: చాలామంది తాము ఒంటరిగా మిగిలిపోయామని భావిస్తూ మానసికంగా కుంగిపోతుంటారు. తమను చుట్టూ ఉన్నవారే దూరం చేస్తున్నారని అనుకుంటారు. అయితే, ఒంటరితనానికి అసలు కారణం ఇతరులు కాదు… మన అలవాట్లు, ఆలోచనా విధానమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.
భావోద్వేగాలను ఎవరికీ చెప్పకుండా లోలోపలే దాచుకోవడం, ఎదుటివారు చెప్పకుండానే అర్థం చేసుకోవాలనే అంచనాలు పెట్టుకోవడం వల్ల సంబంధాల్లో దూరం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, గొడవలు వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనం వహించడం బంధాల్లో చీలికలకు దారితీస్తుందని అంటున్నారు.
ఇక, ఇతరులు తమ అనుభవాలు పంచుకుంటున్న సమయంలో వాటిని పక్కనపెట్టి… ప్రతిదీ తమ గురించే మాట్లాడడం, స్పందనలపై అతిగా ఆలోచించడం కూడా ఒంటరితనాన్ని పెంచే కారణాలుగా పేర్కొంటున్నారు. చిన్న విషయాలకే అనుమానాలు పెంచుకుని, అసలు సమస్య లేనప్పటికీ సంబంధాలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.
కొంతమంది నిజాలు చెప్పడం వల్ల గొడవలు వస్తాయనే భయంతో మౌనంగా ఉంటారు. కానీ ఈ మౌనం తాత్కాలిక శాంతిని ఇచ్చినా… దీర్ఘకాలంలో బంధాలను మరింత దూరం చేస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే, ‘ఒంటరితనం నా తలరాతే’ అనే నమ్మకం వ్యక్తిని సమాజం నుంచి దూరంగా నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ముందుగా తమ ఆలోచనా విధానంలో మార్పు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన వ్యక్తులతో భావాలను పంచుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.