Health Tips : నీరసంగా అనిపిస్తోందా? తక్షణ శక్తి కోసం అరటిపండు తినాలా.. ఖర్జూరం తినాలా?

నీరసంగా అనిపిస్తోందా? తక్షణ శక్తి కోసం అరటిపండు తినాలా.. ఖర్జూరం తినాలా?

Update: 2026-01-26 01:30 GMT

Health Tips : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసట, నీరసం అనేవి అందరినీ వేధిస్తున్న సమస్యలు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని నిస్సత్తువ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ అలసటను వదిలించుకుని, తక్షణమే శక్తిని పొందడానికి చాలామంది అరటిపండు లేదా ఖర్జూరాలను తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ సమయంలో దేనిని తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా ఒక మీడియం సైజ్ ఉన్న అరటిపండులో దాదాపు 105 క్యాలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విట‌మిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. మీరు రోజంతా ఉత్సాహంగా పని చేయాలనుకున్నా లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎక్కువ సేపు అలసిపోకుండా ఉండాలనుకున్నా అరటిపండు బెస్ట్ ఆప్షన్. అరటిపండులోని ఫైబర్ చక్కెరను రక్తంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల మీకు ఎక్కువ సమయం పాటు శక్తి అందుతూనే ఉంటుంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా బ్రేక్ సమయంలో అరటిపండు తినడానికి ఇష్టపడతారు.

మరోవైపు, ఖర్జూరాల విషయానికి వస్తే ఇవి క్యాలరీల గని. కేవలం మూడు లేదా నాలుగు ఖర్జూరాలు తింటే చాలు.. మీకు 90 నుంచి 120 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఖర్జూరాల్లో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. మీరు విపరీతమైన అలసటతో ఉన్నప్పుడు లేదా నీరసంగా అనిపించినప్పుడు తక్షణమే గ్లూకోజ్ లెవల్స్ పెంచుకోవడానికి ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఉపవాసం విరమించే సమయంలో చాలామంది ఖర్జూరాలను తింటారు. ఇవి కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

మీరు జిమ్ లేదా వర్కౌట్ చేయడానికి అరగంట ముందు అరటిపండు తింటే, వ్యాయామం చేసేటప్పుడు మంచి స్టామినా లభిస్తుంది. ఒకవేళ వ్యాయామం ముగిసిన తర్వాత శరీరం పూర్తిగా అలసిపోయి, తక్షణమే శక్తి కావాలనుకుంటే రెండు ఖర్జూరాలు తింటే సరిపోతుంది. అయితే, మధుమేహం ఉన్నవారు ఖర్జూరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీటిలో సహజ చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.

మీ అవసరాన్ని బట్టి రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎక్కువ సేపు శక్తి కావాలంటే అరటిపండు, తక్షణం ఉత్సాహం రావాలంటే ఖర్జూరం ఎంచుకోండి. అయితే ఏవైనా సరే పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం అని గుర్తుంచుకోండి. రోజుకు ఒక అరటిపండు లేదా రెండు మూడు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నిత్యం యవ్వనంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.

Tags:    

Similar News