Milk Allergy : పాలు పడని వారు పెరుగు తినవచ్చా? అలర్జీ ఉన్నవారు తెలుసుకోవాల్సిన అసలు నిజాలివే
పాలు పడని వారు పెరుగు తినవచ్చా? అలర్జీ ఉన్నవారు తెలుసుకోవాల్సిన అసలు నిజాలివే
Milk Allergy : సాధారణంగా పాలు తాగిన తర్వాత కొందరికి వాంతులు, పొట్టలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణం పాలలో ఉండే కేసిన్ వంటి ప్రొటీన్లు లేదా లాక్టోస్ అనే చక్కెర పదార్థం. అయితే పాలు పడని వారు పెరుగు తినవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకేలా ఉండదు. ప్రముఖ వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలను పెరుగుగా మార్చే ప్రక్రియలో (ఫెర్మెంటేషన్), అందులోని లాక్టోస్, ప్రొటీన్లు పాక్షికంగా విచ్ఛిన్నం అవుతాయి. దీనివల్ల చాలా మందికి పాలు తాగితే వచ్చే ఇబ్బందులు పెరుగు తింటే రావు.
నిజానికి పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి పాలు పడని చాలా మందికి పెరుగు అమృతంలా పని చేస్తుంది. అయితే కొంతమందికి పాలలో ఉండే ప్రొటీన్ల వల్ల తీవ్రమైన అలర్జీ ఉంటుంది. అటువంటి వారు పెరుగు తిన్నా కూడా చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. అందుకే పాలు పడవు కదా అని పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ మీ శరీరం దానికి ఎలా స్పందిస్తుందో గమనించడం చాలా ముఖ్యం.
పాలు పడని వారు పెరుగు తినాలనుకుంటే మొదట చిన్న పరిమాణంలో ప్రయత్నించాలి. పెరుగు తిన్న తర్వాత ఎటువంటి ఇబ్బంది కలగకపోతే, క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఒకవేళ ఆవు లేదా గేదె పాలు ఏ రూపంలో తీసుకున్నా పడటం లేదంటే.. మార్కెట్లో లభించే సోయా పెరుగు లేదా కొబ్బరి పాలతో తయారు చేసిన పెరుగును ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. వీటిలో పాల ప్రొటీన్లు ఉండవు కాబట్టి అలర్జీ వచ్చే అవకాశం తక్కువ.
ఏది ఏమైనా ఆహార సంబంధిత అలర్జీలను తేలికగా తీసుకోకూడదు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మంపై తీవ్రమైన మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలర్జీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మీకు అసలు ఏ పదార్థం పడటం లేదో స్పష్టంగా తెలుస్తుంది. దాని ప్రకారం డాక్టర్లు సూచించిన డైట్ పాటించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.