Smartphone: మీరు కూడా భోజనం చేసేప్పుడు మొబైల్ చూస్తున్నారా.? జరిగేది ఇదే..
Smartphone: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేని వారు కనిపించరనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి భోజనం చేసేప్పుడు కూడా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే తినేప్పుడు ఫోన్ ఉపయోగించడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Smartphone: మీరు కూడా భోజనం చేసేప్పుడు మొబైల్ చూస్తున్నారా.? జరిగేది ఇదే..
Smartphone: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేని వారు కనిపించరనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి భోజనం చేసేప్పుడు కూడా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే తినేప్పుడు ఫోన్ ఉపయోగించడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి
ఇప్పుడు ప్రతి ఇంట్లో భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ చేతిలో ఉండటం సాధారణంగా కనిపిస్తోంది. పిల్లలకు కార్టూన్లు చూపిస్తూ భోజనం పెట్టడం, పెద్దలు సోషల్ మీడియా చూస్తూ తినడం, వీడియోలు లేదా సీరియల్స్ చూస్తూ భోజనం చేయడం. ఇలా ఆహారంపై దృష్టి పెట్టకుండా స్క్రీన్‌పై దృష్టి పెట్టే అలవాటు పెరుగుతోంది. దీని వల్ల మనం ఎంత తింటున్నామో కూడా గుర్తించకుండా పోతుంది.
పిల్లల అభివృద్ధిపై ప్రభావం
భోజనం చేసే సమయం కేవలం కడుపు నింపుకునే సమయం మాత్రమే కాదు. పిల్లల మానసిక, సామాజిక అభివృద్ధికి కూడా ఇది ముఖ్యమైన సమయం. ఈ సమయంలో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటం, మాటలు వినడం, ముఖభావాలను గుర్తించడం, కొత్త పదాలు నేర్చుకోవడం లాంటివి నేర్చుకుంటారు. కానీ మొబైల్ స్క్రీన్‌లో మునిగిపోతే ఇలాంటివేం ఉండవు.
ఈ అలవాటు ఉన్న పిల్లల్లో మాటల అభివృద్ధి ఆలస్యం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇతరులపై దృష్టి పెట్టే అలవాటు తగ్గుతుంది. స్క్రీన్ లేకుండా భోజనం చేయడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఇలా క్రమంగా పిల్లల ప్రవర్తనపై కూడా ప్రభావం పడుతుంది.
పెద్దల ఆరోగ్యంపై వచ్చే సమస్యలు
ఈ అలవాటు పిల్లలకే కాదు పెద్దలకూ హానికరమే. తినేటప్పుడు మొబైల్ చూస్తే.. మన దృష్టి భోజనంపై ఉండదు, దీంతో ఎంత తింటున్నామో కూడా గుర్తించలేము. ఈ కారణంగా అవసరానికి మించి తినే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల అధిక కేలరీలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం
నిపుణుల ప్రకారం భోజనం సమయంలో మొబైల్ వినియోగం నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు కారణమని స్పష్టమైన పరిశోధనలు ఇంకా లేవు. కానీ కొన్ని పరిస్థితులు మాత్రం ప్రమాదాన్ని పెంచవచ్చు. ఉదాహరణకు ఎక్కువగా తినడం, ఫాస్ట్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం ఎంచుకోవడం వంటి వాటితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇలా జరిగితే భవిష్యత్తులో మెటబాలిక్ సమస్యలు, డయాబెటిస్ ప్రమాదం పెరగవచ్చు.
స్క్రీన్ లేకుండా భోజనం చేయడం ఎందుకు మంచిది?
నిపుణులు చెప్పే ముఖ్యమైన సూచన ఏమిటంటే భోజనం చేసే సమయంలో స్క్రీన్‌లను పూర్తిగా ఆఫ్ చేయడం మంచిది. భోజనం చేసేప్పుడు టీవీ, మొబైల్‌కు దూరంగా ఉంటే.. పిల్లలు కొత్త పదాలు నేర్చుకుంటారు, కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది, ఆహారం రుచిపై దృష్టి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా
అవసరానికి మించి తినడం తగ్గుతుంది. నిదానంగా ఏకాగ్రతతో భోజనం చేస్తే సంకేతాలను శరీరం సరిగ్గా గుర్తిస్తుంది. దీని వల్ల బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
భోజనం చేసేప్పుడు మొబైల్ చూడడం చిన్న అలవాటుగా అనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి భోజనం చేసే సమయంలో మొబైల్, టీవీ, ట్యాబ్ వంటి స్క్రీన్‌లను దూరంగా పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా భోజనం చేయడం ఆరోగ్యానికి ఉత్తమం.