Chanakya Niti: మానసికంగా ఆరోగ్యంగా ఉంటే విజయం మనదే.. అందుకోసం ఏం చేయాలి?

Chanakya Niti: మనం శరీర ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వం. కానీ, మానసికంగా కూడా బలంగా ఉండడం విజయం సాధించడానికి అవసరం. .

Update: 2026-03-11 02:08 GMT

Chanakya Niti

Chanakya Niti: సాధారణంగా మనం శారీరకంగా ఎంత బలంగా ఉన్నాం? శరీర ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. శారీరకంగా బలంగా.. శక్తివంతంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆరోగ్యం అంటే మన ఒంట్లో వ్యాధులు లేకపోవడం అనే భావిస్తాం. ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుని.. మందులు మాకులూ మింగేస్తాం. కాస్త కుదుట పడగానే హమ్మయ్య తగ్గింది అని సంతోషిస్తాం. నిజమే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మన దిన చర్యలు సాఫీగా సాగిపోతాయి. కానీ, ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరమే. మానసికంగా బలహీనంగా ఉంటే విజయం సాధించడం కష్టం అయిపోతుంది. దృఢమైన మనస్సు ఒక వ్యక్తిని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, వారి లక్ష్యాలను సాధించడానికి శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. మానసికంగా బలంగా మారడానికి ఆచార్య చాణక్యుడు కొన్ని చిట్కాలను తన నీటి చంద్రికలో వెల్లడించారు. వీటిని ఫాలో అయితే మానసికారోగ్యం శక్తివంతంగా ఉంటుంది. ఇవి కచ్చితంగా మన ఆలోచన, విశ్వాసం, జీవనశైలిని పూర్తిగా మార్చగలవు.

ప్రతిరోజూ ఆలోచించే అలవాటు..

మన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటారు కదా.. అలాగే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మంచి ఆలోచనలను చేయడం ప్రాక్టీస్ చేయాలంటారు చాణక్యుడు. మన ఆలోచనలను ఎలా అర్థం చేసుకోవాలో, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆలోచించాలి. మీరు ప్రతిరోజూ కొంత సమయం ఇలా ఆలోచించడానికి కేటాయించాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని మరింత సహనంతో, తెలివిగా వ్యవహరించేలా చేస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలను మెరుగుపరచడంలో మనకు సహాయపడుతుంది.

స్వావలంబన..

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, మనం మన మానసిక బలాన్ని పెంచుకోవాలనుకుంటే, మొదటి అడుగు స్వావలంబన పొందడం. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మన మనస్సు బలపడుతుంది. అలాకాకుండా, మనం ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడటం ప్రారంభిస్తే అది మనల్ని అంతర్గతంగా బలహీనపరుస్తుంది. చిన్న చిన్న బాధ్యతలను కూడా మనకు మనమే తీసుకోవడం ప్రారంభించినప్పుడు, మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మనల్ని మానసికంగా కూడా బలంగా చేస్తుంది.

సమయాన్నిఉపయోగించుకోవడం..

ఆచార్య చాణక్యుడు సమయం అత్యంత విలువైంది అంటారు. మానసికంగా బలంగా ఉన్నవారు సమయానికి విలువ ఇస్తారు. దానిని పనికిరాని విషయాలకు వృధా చేయరు. చాణక్యుడి ప్రకారం, సమయానికి మేల్కొని, పనులకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రతి పనిని సమయానికి పూర్తి చేసే అలవాటు ఎవరినైనా మానసికంగా బలంగా చేస్తుంది.

ప్రతికూల ఆలోచనలకు దూరంగా..

చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. మన మనస్సును ప్రశాంతంగా, మానసికంగా బలంగా ఉంచుకోవాలంటే ముందు మనం మన నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. నిరాశ, భయం, కోపం వంటి భావోద్వేగాలు మన మనస్సును పూర్తిగా బలహీనపరుస్తాయి. మనం పాజిటివ్ గా ఆలోచిస్తే, మనకు ఎదురయ్యే పాటి సవాలును ధైర్యంగా ఎదుర్కొని దానిని అధిగమించగలమని ఆచార్య చాణక్యుడు చెప్పారు.

కొత్త విషయాలను నేర్చుకోవడం..

మన మానసిక బలాన్ని పెంచుకోవాలంటే, జీవితంలోని ప్రతి దశలోనూ కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలని ఆచార్య చాణక్యుడు అన్నారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, కొత్త జ్ఞానాన్ని ఎలా పొందాలో తెలిసిన వ్యక్తి క్రమంగా మానసికంగా బలంగా మారుతాడు. అందువలన, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, కొత్త పుస్తకాలు చదవడం.. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం.. ఇతరుల నుండి మంచిని నేర్చుకోవడానికి ప్రయత్నించడం చేయాలి.

సంజూ సామ్సన్ సక్సెస్ స్టోరీ..

మానసిక బలానికి మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే.. అది క్రికెటర్ సంజూ సామ్సన్. ఎంతో కష్టపడి టీమిండియాలోకి వచ్చాడు. తరువాత అక్కడ నువ్వు పనికిరావని అందరూ హేళన చేశారు. చాలా సార్లు బెంచ్ కే పరిమితం అయిపోయాడు. గ్రౌండ్ లో ఆడుతున్న ఆటగాళ్లకు మంచినీళ్లు అందిస్తూ తిరిగే పరిస్థితి. కానీ, అతను మానసికంగా దృఢంగా నిలబడ్డాడు. కుంగిపోలేదు. తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు. అందుకోసం ప్రయత్నాలు చేశాడు. ప్రతికూల ఆలోచనలు లేకుండా పాజిటివ్ గా ఆలోచించాడు. కట్ చేస్తే టీ20 వరల్డ్ కప్ లో హీరోగా మారాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అందువల్ల అపజయాలకు కుంగిపోకుండా.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే విజయం సాధించడం కష్టమేమీ కాదు.

Tags:    

Similar News