Chanakya Niti: ఈ భయాలను వదులుకోకపోతే విజయం సాధించలేరు
Chanakya Niti: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయం గురించి భయాలు ఉంటాయి. వీటిలో కొన్నింటికి భయపడితే జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేమని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
Chanakya Niti
Chanakya Niti: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక భయం ఉంటుంది. జీవితంలో ముందుకు సాగాలంటే.. విజయాన్ని సాధించాలంటే ఆ భయం మనల్ని వెంటాడుతుంది. ఒక్కో విషయంలో ముందడుగు వేయడానికి ఆ భయమే వెనక్కి లాగుతుంది. దాంతో చేతికి అందివచ్చిన విజయం కూడా పక్కకి జరిగిపోతుంది. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని భయాల్ని పక్కన పెట్టేయాలి. అలాంటి భయాల నుంచి బయటపడే ఆలోచన చేయాలి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి విజయం సాధించాలంటే ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి వివరంగా చెప్పారు.
భయానికి సంబంధించి చాణక్యుడు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. మన విజయానికి ప్రతిబంధకంగా ఉన్న భయాలను ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాన్ని ఆయన వివరించారు. చాణక్యుడి ప్రకారం నాలుగు భయాలు విజయం సాధించాలనుకునే వారికి అడ్డంకిగా నిలుస్తాయి. నిజం చెప్పలేకపోవడం.. మార్పులకు భయపడటం.. కష్టానికి వెనకడుగు వేయడం.. పోరాటానికి జడవడం ఈ నాలుగు మన విజయాలకు ప్రధాన అడ్డంకులు అని ఆయన వివరించారు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం
నిజం చెప్పలేకపోవడం..
Chanakya Niti: నిజం చెప్పలేకపోవడం అంటే అబద్ధం చెప్పడం అని కాదు. కొన్ని విషయాల్లో మన వలన జరిగిన తప్పులను దాచి పెట్టే పని చేస్తాం. దానివలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినపుడు దానిని ధైర్యంగా చెప్పుకోగలిగితే అవతల వారికి మన మీద నమ్మకం ఏర్పడుతుంది. సమాజంలో విలువ పెరుగుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే సమాజం నుంచి కూడా మద్దతు అవసరమే కదా. నిజం చెప్పలేక.. నిజం చెబితే ఏమవుతుందో అని దాచి పెట్టినా.. అబద్ధం చెప్పినా తాత్కాలికంగా ఉపశమనం దొరుకుతుంది కానీ, జీవితంలో విజయం సాధించాలంటే అది భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని చాణక్యుడు చెప్పారు.
మార్పులకు భయపడటం..
చాలామంది కొత్తగా వచ్చే మార్పులకు భయపడతారు. ఆ మార్పులను అంగీకరించడానికి లేదా ఆ మార్పును స్వీకరించడానికి తొందరగా ముందుకు రారు. మార్పు ఎప్పుడూ మంచికే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాలంతో పాటు మార్పులు సహజం. మార్పులు జరగకపోతే చాలా విషయాలు అసంపూర్తిగా ఉండిపోతాయి. మన కెరీర్ లో.. ఇంట్లో.. బంధువుల్లో.. స్నేహితుల్లో వచ్చే మార్పులను గమనిస్తూ వాటిని అంగీకరించే ప్రయత్నం చేయడం విజయానికి ఎంతో అవసరం. ఒక మార్పును గుర్తించకపోయినా.. గుర్తించి అంగీకరించడానికి ఆలస్యం చేసినా అది మనకు చేటు చేసే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను.. కొత్తగా ఈ మార్పేమిటి అనుకుంటే ఇంకా మన జీవితం అక్కడే ఆగిపోతుంది. విజయం మన దరిదాపుల్లోకి కూడా రాదని చాణక్యుడు మార్పు గురించి తెలిపారు.
కష్టానికి భయపడటం..
Chanakya Niti: ఏదైనా కష్టమైనా పని మనకు వచ్చినపుడు అమ్మో అనుకోవడం సహజం. మనలో ఎక్కువ మంది కష్టమైన పని అడ్డం వచ్చినపుడు దాని నుంచి తప్పించుకునే ఆలోచన చేస్తారు. దీంతో ముందడుగు వేయలేకపోతారు. కష్టే ఫలి అని అన్నారు. అందుకే కష్టం వచ్చింది అని వదిలేయకుండా.. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే విజయం దానంతట అదే వస్తుందని చాణక్యుడు వివరించారు.
పోరాటానికి వెనకడుగు..
జీవితమే ఒక పెద్ద పోరాటం. ఇంత పెద్ద పోరాటంలో మన దారిలో వచ్చే చిన్న చిన్న పోరాటాలను జయించుకుంటూ ముందుకు వెళ్లడమే విజయానికి సోపానం. విజయం వైపు వెళ్లాలంటే పోరాటాలకు ఎదురు వెళ్ళాలి. ధైర్యంగా పోరాడాలి. పరిస్థితులు కావచ్చు.. తోటివారు కావచ్చు ఎవరితోనైనా పోరాటం చేయాల్సి వస్తే వెనకడుగు వేయకూడదు. పోరాడితేనే కదా విజయం వచ్చేది. సమస్యలతో పోరాడకుండా.. పలాయన వాదాన్ని నమ్ముకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టు మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. అందుకే సమస్యలతో ధైర్యంగా పొందాడాలని చాణక్యుడు సూచించారు.
అదండీ విషయం జీవితంలో రాణించాలంటే పట్టు విడుపు ఎంత అవసరమో భయాన్ని వదిలి పోరాడటమూ అంతే ముఖ్యం. నిజాయతీగా ఉండడం.. మార్పులను అంగీకరించి తదనుగుణంగా మన ప్లాన్స్ మార్చుకోవడం చేయడం ద్వారా విజయానికి ముందడుగు వేయొచ్చు. ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పిన మాటలు అయినా అవి ఇప్పటికీ ఆచరించదగినవిగానే చెప్పవచ్చు.