Chanakya Niti: ఇలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు అదృష్టవంతులు.. చాణక్యుడు చెప్పింది ఇదే!
Chanakya Niti: పిల్లల్లో కొన్ని మంచి లక్షణాలు తల్లిదండ్రులను అదృష్టవంతులుగా మారుస్తాయి. అలంటి లక్షణాలు ఉన్న పిల్లలు జీవితంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు
Chanakya Niti
Chanakya Niti: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. తమ పిల్లలు సమాజంలో గౌరవంగా.. ఇబ్బందులు లేకుండా ఉండాలని భావిస్తారు. వారి ఎదుగుదల ప్రతి దశలోనూ పిల్లల్లో మంచితనంతో పెరగాలని ఆశిస్తారు. జీవిత చరమాంకంలో పిల్లల చల్లని నీడలో జీవితం సాగిపోవాలని అనుకుంటారు. కానీ, చాలామంది తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లోనో.. ఒంటరిగా సొంత ఊరల్లోనో పిల్లలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో జీవితమంతా పిల్లల ఉన్నతి కోసం పాటుపడిన తాము ఒంటరిగా మిగిలిపోయామే అనే బాధ వారిని మరణం వరకూ వెంటాడుతుంది. అయితే, కొన్ని మంచి లక్షణాలు ఉన్న పిల్లలు కలిగిన వారు చాలా అదృష్టవంతులని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఉన్న పిల్లలు అందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.
విధేయత -మర్యాదపూర్వక స్వభావం:
చాణక్య నీతి ప్రకారం, విధేయతగల పిల్లలు వారి తల్లిదండ్రులకు గొప్ప ఆస్తి. పెద్దల మాట విని, నియమాలను పాటించి, వారి జీవితంలో విలువలను అలవర్చుకునే పిల్లలను సమాజం గౌరవిస్తుంది. అలాంటి పిల్లలు తమ సొంత ఇంటి ప్రతిష్టను మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం, వంశప్రతిష్టను కూడా పెంచుతారు.
మంచీ చెడులను గుర్తించడం :
మంచి పిల్లల లక్షణం మంచి -చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం. చాణక్యుడు చెప్పినట్లుగా, వివేకవంతుడైన వ్యక్తి మాత్రమే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడు. పరిస్థితిని అర్థం చేసుకుని, ఆలోచనాత్మకంగా అడుగులు వేసే పిల్లలు కష్ట సమయాల్లో కూడా వారి కుటుంబానికి మద్దతుగా ఉంటారు. ఈ గుణం పిల్లలను స్వావలంబనతో బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది.
జ్ఞానం -భక్తి పట్ల గౌరవం:
విద్య, అనుభవం, అభ్యాసాన్ని తీవ్రంగా పరిగణించే పిల్లలు జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఎప్పుడూ జ్ఞానం పొందాలనే తపన ఉన్న పిల్లలు ఎల్లప్పుడూ సరస్వతి, లక్ష్మీ దేవి ఆశీస్సులను పొందుతారు. మంచి విద్యను పొందడం ద్వారా, వారు కుటుంబానికి కీర్తిని తెస్తారు. విద్య మాత్రమే కాదు, ప్రాపంచిక జ్ఞానం కూడా ఉన్న పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా తమ ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు. వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు.
లక్ష్యాలు -ఉన్నత ఆలోచనలు:
చాణక్యుడి ప్రకారం, ఉన్నత ఆదర్శాలను కలిగి ఉన్న , జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకున్న పిల్లలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. లక్ష్యాలను సాధించే పిల్లలు క్రమశిక్షణ, సహనాన్ని నేర్చుకుంటారు. అందువలన, పిల్లలు జీవితంలో ఏదైనా సాధించినప్పుడు, వారి తల్లిదండ్రులు సమాజంలో గౌరవాన్ని పొందుతారు.
అందుకే, చాణక్యుడు ఇలా అంటాడు.. సద్గుణవంతులైన పిల్లలు తమ జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా, వారి తల్లిదండ్రుల జీవితాలను కూడా అర్థవంతం చేస్తారు. అలంటి లక్షణాలు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు అదృష్టవంతులు.