Kidney Health: మూత్రంలో నురుగు వస్తోందా? అయితే అది కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు..తస్మాత్ జాగ్రత్త

Kidney Health : చాలా మంది మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు రావడాన్ని పెద్దగా పట్టించుకోరు.

Update: 2026-01-24 07:30 GMT

Kidney Health: మూత్రంలో నురుగు వస్తోందా? అయితే అది కిడ్నీ వ్యాధికి సంకేతం కావొచ్చు..తస్మాత్ జాగ్రత్త

Kidney Health: చాలా మంది మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు రావడాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రంలో అధికంగా నురుగు రావడం అనేది శరీరంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందనడానికి ముందస్తు హెచ్చరిక. ఒకవేళ నురుగు తెల్లగా ఉండి, ఒకటికంటే ఎక్కువసార్లు ఫ్లష్ చేసినా పోకపోతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మూత్రంలో నురుగు రావడానికి ప్రధాన కారణం ప్రోటీన్ యూరియా. అంటే మూత్రం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ బయటకు వెళ్ళిపోవడం. సాధారణంగా మన కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను మాత్రమే మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు లేదా బలహీనపడినప్పుడు, అవి ప్రోటీన్లను ఆపలేవు. ఈ ప్రోటీన్లు మూత్రంలో కలిసినప్పుడు నురుగు ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి ప్రధాన సంకేతం కావచ్చు.

మధుమేహం ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల కాలక్రమేణా కిడ్నీలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల కిడ్నీల ఫిల్టరింగ్ సామర్థ్యం తగ్గిపోయి, ప్రోటీన్లు మూత్రంలోకి లీక్ అవుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ మూత్రంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. కేవలం డయాబెటిస్ మాత్రమే కాదు, లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా ఇలా జరగవచ్చు.

అయితే ప్రతిసారి నురుగు రావడం ప్రమాదకరం కాకపోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అంటే డీహైడ్రేషన్ కలిగినప్పుడు కూడా మూత్రం చిక్కగా మారి నురుగు వస్తుంది. ఇలాంటి సమయంలో మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఒకవేళ మీరు తగినంత నీరు (రోజుకు 8 గ్లాసులు) తాగినా సమస్య తగ్గకపోతే, అది కచ్చితంగా అంతర్గత ఆరోగ్య సమస్యే. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా యూరిన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News