Diabetes Awareness : స్వీట్ కనిపిస్తే ఆగలేకపోతున్నారా? అయితే మీ బాడీలో ఏదో జరుగుతోంది చూస్కోండి

స్వీట్ కనిపిస్తే ఆగలేకపోతున్నారా? అయితే మీ బాడీలో ఏదో జరుగుతోంది చూస్కోండి

Update: 2026-01-27 04:30 GMT

Diabetes Awareness : కొందరికి భోజనం చేసినా, టిఫిన్ చేసినా చివరగా ఏదైనా స్వీట్ పడాల్సిందే. మరికొందరికైతే అసలు సమయం సందర్భంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తీపి పదార్థాలు తినాలనిపిస్తుంటుంది. దీనినే ఇంగ్లీష్‌ లో షుగర్ క్రేవింగ్స్ అంటారు. ఇది కేవలం రుచి కోసం చేసే పని మాత్రమే కాదు, దీని వెనుక మానసిక, శారీరక కారణాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు మనకు స్వీట్లు ఎందుకు తినాలనిపిస్తుంది? అలా తింటే వచ్చే ముప్పులేంటి? ఆ కోరికను ఎలా అదుపు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

స్వీట్లు ఎందుకు తినాలనిపిస్తుంది?

పదే పదే తీపి పదార్థాలు తినాలనే కోరిక కలగడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని డాక్టర్లు చెబుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ సేపు ఆకలితో ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోతాయి. అప్పుడు మెదడు తక్షణ శక్తి కోసం తీపిని కోరుకుంటుంది. అలాగే విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, మానసిక అలసట ఉన్నప్పుడు మన శరీరం డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ కోసం స్వీట్ల వైపు మళ్లుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారికి కూడా ఈ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి.

వచ్చే అనర్థాలు

అతిగా స్వీట్లు తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి చాలా త్వరగా బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అస్తవ్యస్తమై డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. పంటి నొప్పి, పిప్పపళ్లు రావడం సర్వసాధారణం. ఇవే కాకుండా అతిగా షుగర్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు, ముఖంపై మొటిమలు రావడం, నిరంతరం నీరసంగా అనిపించడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది.

క్రేవింగ్స్‌ను ఎలా అదుపు చేయాలి?

సమయానికి భోజనం చేయాలి. ఆకలి వేసే వరకు వెయిట్ చేయకుండా, సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవాలి. కొన్నిసార్లు మన శరీరం దాహాన్ని ఆకలిగా లేదా స్వీట్ క్రేవింగ్‌గా భ్రమింపజేస్తుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు చాక్లెట్లకు బదులుగా ఖర్జూరం, తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. యోగా లేదా నడక వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి క్రేవింగ్స్‌ను అరికడతాయి. ఒక్కసారిగా మానేయడం కష్టం కాబట్టి, రోజూ తినే తీపి పరిమాణాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ రండి.

Tags:    

Similar News