Health Tips : ఉదయం లేవగానే తలనొప్పి, నీరసం వస్తున్నాయా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఉదయం లేవగానే తలనొప్పి, నీరసం వస్తున్నాయా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Health Tips : రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మరుసటి రోజు అలసటగా ఉండటం సహజం. కానీ కొందరికి రాత్రంతా హాయిగా నిద్రపోయినా, ఉదయం లేవగానే తల భారంగా అనిపిస్తుంది. ఏదో తెలియని నీరసం, ఆవలింతలు, చిరాకు వెంటాడుతుంటాయి. దీనికి కారణం కేవలం అలసట మాత్రమే కాదు, మీ శరీరంలో జరుగుతున్న కొన్ని అంతర్గత మార్పులు కూడా కావచ్చు. అసలు నిద్ర పోయినా తల ఎందుకు భారంగా ఉంటుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
చాలామంది రాత్రి 7-8 గంటలు పడుకున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఆ నిద్ర ఎంత ప్రశాంతంగా ఉందనేది ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రపోయే ముందు గంటల తరబడి మొబైల్ చూడటం లేదా టీవీ చూడటం వల్ల మెదడు ఉద్రేక్తకు గురవుతుంది. దీనివల్ల శరీరం నిద్రపోతున్నా, మెదడు చురుగ్గానే ఉంటుంది. ఫలితంగా ఉదయం లేవగానే తల భారంగా, కళ్లు మంటలుగా అనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు కూడా నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి.
శరీరంలో నీటి కొరత : రాత్రిపూట మన శరీరం లోపల అనేక రిపేర్లు జరుగుతుంటాయి. ఈ సమయంలో శరీరానికి నీరు అవసరం. తగినంత నీరు తాగకపోతే, రక్తం చిక్కబడి మెదడుకు ఆక్సిజన్ సరఫరా కొంచెం నెమ్మదిస్తుంది. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే తల తిరుగుతున్నట్లు లేదా భారంగా అనిపిస్తుంది. అలాగే, తప్పుగా పడుకునే భంగిమ వల్ల మెడ కండరాలు బిగుసుకుపోయి తల వెనుక భాగంలో నొప్పి వస్తుంది.
ఆరోగ్య సమస్యలు: సైనస్ సమస్య ఉన్నవారికి లేదా ముక్కు దిబ్బడ ఉన్నవారికి గాలి సరిగ్గా అందదు. నిద్రలో ఆక్సిజన్ లెవల్స్ కొద్దిగా తగ్గినా కూడా ఉదయం తల భారంగా ఉంటుంది. దీనినే స్లీప్ అప్నియా అని కూడా అంటారు. మరికొందరిలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. నిరంతరం ఇలాగే ఉంటే అది ఏకాగ్రత లోపానికి, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది.
పరిష్కార మార్గాలు:
టైమ్ మేనేజ్‌మెంట్: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.
డిజిటల్ డిటాక్స్: పడుకోవడానికి గంట ముందు మొబైల్‌ను దూరంగా పెట్టేయండి.
సరైన దిండు: మెడకు, తలకు సౌకర్యంగా ఉండే మెత్తటి దిండును వాడండి.
నీరు తాగడం: పడుకునే ముందు, నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగడం మర్చిపోకండి.
యోగ, ధ్యానం: మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజూ కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయండి.