Prostate Cancer: పురుషుల్లో తరచూ మూత్ర విసర్జన.. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు హెచ్చరికేనా?

Prostate Cancer: పురుషుల్లో తరచూ మూత్రం రావడం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణమా? PSA పరీక్ష ప్రాధాన్యం, ప్రమాద కారకాలు, వైద్యుల సూచనలు తెలుసుకోండి.

Update: 2026-01-29 06:27 GMT

 Prostate Cancer: పురుషుల్లో తరచూ మూత్ర విసర్జన.. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు హెచ్చరికేనా?

Prostate Cancer: వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పురుషులు మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా తరచూ మూత్రం రావడం, రాత్రి నిద్రలో లేచి మళ్లీ మళ్లీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ వయోభావ మార్పులుగా భావిస్తారు. అయితే, ఇవే లక్షణాలు కొన్ని సందర్భాల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశకు సంబంధించిన హెచ్చరికలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లలో ఒకటి. ఇది మూత్రాశయం కింద భాగంలో, పెల్విస్ ప్రాంతంలో ఉండే ప్రోస్టేట్ గ్రంధిలో ఏర్పడుతుంది. ఈ గ్రంధి పురుషుల హార్మోన్ల సమతుల్యతకు, ప్రজনన ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చాలా మంది ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.

వైద్యుల మాటల్లో చెప్పాలంటే, తరచూ మూత్రం రావడం, మూత్రం పోవడంలో ఇబ్బంది, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, పూర్తిగా మూత్రం ఖాళీ కాలేదన్న భావన వంటి సమస్యలు ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సూచనలుగా ఉండొచ్చు. కొంతమందిలో మూత్రంలో రక్తం కనిపించడం, అకస్మాత్తుగా మూత్రాన్ని ఆపుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉత్పన్నమవుతాయి. మరికొందరికి వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, కారణం తెలియని బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు నెమ్మదిగా అభివృద్ధి చెందడం వల్ల చాలా మంది పురుషులు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ సమయానికి ప్రోస్టేట్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను తొలిదశలోనే గుర్తించవచ్చు. ముఖ్యంగా PSA (Prostate Specific Antigen) పరీక్ష ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వయస్సు ప్రధాన ప్రమాదకారకంగా భావిస్తారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ చరిత్ర, హార్మోన్ల మార్పులు, అధిక కొవ్వు ఉన్న ఆహారం, పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి జీవనశైలి అలవాట్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.

వైద్య నిపుణులు పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు రెగ్యులర్‌గా ప్రోస్టేట్ పరీక్షలు చేయించుకోవాలని, మూత్రానికి సంబంధించిన చిన్న మార్పులు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

Tags:    

Similar News