New coronavirus in China: చైనాలో ప్రాణాంతకమైన మరో కొత్త కరోనావైరస్

Update: 2025-02-22 08:39 GMT

New coronavirus in China: చైనాలో ప్రాణాంతకమైన మరో కొత్త కరోనావైరస్

HKU5-CoV-2 in China: కరోనావైరస్ మిగిల్చిన విషాదం నుండి ప్రపంచం ఇంకా తేరుకోనేలేదు తాజాగా చైనా నుండి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. చైనాలోని గబ్బిలాల్లో ప్రాణాంతకమైన మరో కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించారు. ప్రాణాంతకమైన వైరస్ అని ఎందుకంటున్నారంటే... ఈ వైరస్ సోకిన వారిలో మూడోవంతు జనాన్ని చంపేసేంత శక్తి ఈ వైరస్‌కు ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Full View

చైనాకు చెందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించింది. ఈ కొత్త వైరస్ వేరియంట్‌ను HKU5-CoV-2 అని పిలుస్తున్నారు. మనుషుల్లో గతంలో వచ్చిన కరోనావైరస్ వేరియంట్స్ కంటే ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని షి జెంగ్లీ తెలిపారు.

అప్పట్లో కొవిడ్-19 చైనాలోని ఉహాన్ ల్యాబ్‌లో పుట్టిందని ప్రపంచం అంతా ఆరోపించింది. కానీ ఇదే షి జెంగ్లీ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఉహాన్‌కు ఈ వైరస్‌కు సంబంధం లేదని ఆమె స్పష్టంచేశారు. ఉహాన్ పరిశోధన కేంద్రంలోనే కరోనావైరస్ పుట్టిందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీంతో ఇప్పటికీ కరోనావైరస్ పుట్టుక ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

వాస్తవానికి 2006 లో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. కానీ 2019లోనే అది తీవ్రరూపం దాల్చింది. గబ్బిలాలపై, కరోనావైరస్ షి జెంగ్లీ చాలా పరిశోధనలు చేశారు. అందుకే చైనాలో ఆమెను బ్యాట్‌ఉమన్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్‌లో గబ్బిలాలను బ్యాట్ అని అంటారనే సంగతి తెలిసిందే.

ఈ కొత్త రకం కరోనావైరస్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌కు (MERS) సంబంధించిన వైరస్‌ కిందకు వస్తుందని పరిశోధకులు తెలిపారు. అంటే జంతువుల నుండి మనుషులకు వ్యాపించే రకం అన్నమాట.

అప్రమత్తమైన ప్రపంచ దేశాలు

చైనాలో కొత్త కరోనావైరస్ వెలుగుచూసిందన్న వార్త మరోసారి యావత్ ప్రపంచానికి షాక్‌కు గురయ్యేలా చేసింది. ఇప్పటికే 2019 లో వచ్చిన కరోనావైరస్ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. అది మిగిల్చిన నష్టం నుండి ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అంతలోనే మరో కొత్త రకం ప్రాణాంతకమైన వైరస్‌ను గుర్తించడంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనా నుండి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

చైనాలోని ఉహాన్ పరిశోధన కేంద్రంలో ఈ కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు జరిపారు. ఇది కూడా 2019 నాటి కొవిడ్ వైరస్ తరహాలోనే మనిషి శరీరంలోకి ప్రవేశించి మానవ కణాలను దెబ్బతీస్తుందని ఈ పరిశోధనల్లో తేలింది. నేరుగా కానీ లేదా ఒకరి నుండి మరొకరికి కానీ వేగంగా వ్యాపించే రిస్క్ ఎక్కువగా ఉందని గుర్తించారు. పరిశోధకులు ఈ విషయాలను జర్నల్ సెల్ అనే మ్యాగజైన్‌కు వెల్లడించారు.

కోలుకోలేని దెబ్బ కొట్టిన కొవిడ్-19

2019 లో చైనాలోని ఉహాన్‌లో మొదలైన కొవిడ్-19 వైరస్ 2020 జనవరి నాటికే ప్రపంచం మొత్తం వ్యాపించింది. 2020 జనవరిలో కొవిడ్-19 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అదే ఏడాది మార్చి 11న ఈ వ్యాధిని పండెమిక్‌గా ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనావైరస్ కారణంగా ఇండియాలో 5,33,662 మంది చనిపోయారు. నాలుగున్నర కోట్ల మంది కొవిడ్ నుండి కోలుకుని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచదేశాలు కరోనావైరస్ వ్యాప్తితో అతలాకుతలం అయ్యాయి. 

Tags:    

Similar News