ఏం తిన్నా కడుపు ఉబ్బుతోందా? ఇలా చెక్ పెట్టండి
Natural remedies to overcome acidity: కడుపుబ్బరం.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. కొంచెం తిన్నా వెంటనే కడుపు ఉబ్బుతోంది. గ్యాస్ నిండి కడుపు నొప్పి వేధిస్తోంది. జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా అపానవాయువు పెరిగి కడుపంతా గందరగోళంగా ఉంటుంది. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? కడుపుబ్బరం సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరిలో బీన్స్, క్యాబేజీ వంటివి తీసుకోవడం వల్ల అపానవాయువు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది అనేక జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. మలబద్ధకం, ఉదరకుహర వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం, జీవన విధానంలో మార్పుల కారణంగానే ఇలా కడుపుబ్బరం సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవేంటంటే..
వేగంగా తినడం వల్ల కడుపుబ్బరం సమస్య వస్తుంది. అందుకే నెమ్మదిగా తినాలి. నీరు కూడా ఒకేసారి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇక ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీ కడుపు ఉబ్బరంగా మారుతుందో ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. అలాంటి ఫుడ్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇక తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ఇది మీ గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవాలి. యాంటాసిడ్లు జీర్ణాశయంలోని వాపును తగ్గించి, గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. రోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వాకింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.