Lifestyle: పదే పదే అద్దంలో చూసుకుంటున్నారా? మీకు ఈ సమస్య ఉన్నట్లే
ఉదయం లేవగానే మనలో చాలా మంది చేసే పనుల్లో అద్దంలో ముఖం చూసుకోవడం. ఇక రాత్రి పడుకునే వరకు పలుసార్లు ముఖాన్ని చూసుకుంటాం. ముఖం కడుక్కున్నప్పుడు, తల దువ్వుకునేప్పుడు ఇలా పలు సందర్భాల్లో అద్దంలో చూసుకుంటుంటాం. అయితే ఎక్కువసార్లు అద్దంలో ముఖం చూసుకోవడం సాధారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్కువసార్లు అద్దంలో ముఖం చూసుకుంటే మిర్రర్ చెకింగ్ సమస్య ఉన్నట్లేనని నిపునులు చెబుతున్నారు.
దీనివల్ల మీ ప్రవర్తనపై ప్రభావితం చూపుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో డైస్మోర్ఫిక్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఇదొక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు తమ గుర్తింపు గురించి తరచుగా టెన్షన్ పడుతుంటారు. అలాగే ప్రతీసారి అద్దంలో చూసుకోవడం వల్ల మీ లోపాలను వెతికేందుకు ప్రయత్నిస్తారు. అద్దాన్ని పదే పదే చూడటం అనేది ఒక నిర్దిష్ట రకమైన రుగ్మతకు సంబంధించినది.
జేఎన్ మెడికల్ కాలేజీ సైకాలజీ విభాగం ఛైర్మన్ అజ్మీ తెలిపిన వివరాల ప్రకారం.. మీరు పదేపదే అద్దంలో మిమ్మల్ని చూసుకుంటుంటే అది మెదడుకు సంబంధించి మానసిక సమస్య కావొచ్చని అంటున్నారు. దీనినే ఓసీడీగా చెబుతుంటారు. కొంతమంది తమను తాము పదేపదే అద్దంలో చుసుకుంటూ తలను దువ్వుకోవడం, మొటిమలను గిచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. ఇది ఒక రకంగా మానసిక రుగ్మతగా చెబుతుంటారు.
ఇలా అద్దంలో ఎక్కువసార్లు చూసుకునే వారు క్రమంగా సమాజానికి దూరమవుతారు. ఒంటరితనానికి అలవాటుపడుతారు. నలుగురితో కలవడానికి ఆసక్తి చూపించరు. కుటుంబ సభ్యులకు దూరమవుతుంటారు. వీరు తమకు అనేక శారీరక లోపాలున్నాయని వారు భావిస్తారు. కొన్నిసార్లు ఈ రుగ్మత చాలా తీవ్రంగా మారుతుంది. తాము అందంగా కనిపించడం లేదని ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేసుకుంటుంటారు. ఓ అంచనా ప్రకారం భారత్‌లో సుమారు 10 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది.