100% పన్నుతో భారతీయ చిత్రాలను దెబ్బతీయనున్న ట్రంప్!
పిచ్చి పనులకు పరాకాష్టగా మారిన ట్రంప్ వ్యవహారం ఆందోళనకరంగా మారిన అమెరికా అధ్యక్షుల తీరు నాడు జో బైడెన్, నేడు ట్రంప్ తీరుతో గందరగోళం భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళం చేస్తున్న ట్రంప్
100% పన్నుతో భారతీయ చిత్రాలను దెబ్బతీయనున్న ట్రంప్!
భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సినిమాలనూ వదల్లేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. చిన్న పిల్లాడి నుంచి క్యాండీ లాక్కున్నట్లుగా ఇది ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటోంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ బాధ్యుడు. ఆయన బలహీనుడే కాక పోటీపడలేని వారు. ఎప్పటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించా’ అని తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ సుంకాల మోతవల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడి ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాల్లో భారీగా ప్రదర్శితమవుతున్నాయి. పెద్ద సినిమాల్లో ఒక్కోటి సగటున 80 లక్షల డాలర్ల వరకూ వసూళ్లు సాధిస్తాయి. కొన్ని కోటి డాలర్లను వసూలు చేసే సందర్భాలూ ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్నా.. అమెరికాలోని వెయ్యి స్క్రీన్లలో ఇండియన్ ఫిల్మ్స్ ప్రదర్శిస్తారు.
అమెరికా చిత్రాలకు గతంలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది. మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైనా అవి అన్ని దేశాలకు చేరేవి కావు. దీంతో హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం సాగేది. ఓటీటీల రాకతో ఆ ఆధిపత్యానికి గండి పడింది. ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాలను నిర్మించినా అనువాదమై అన్ని దేశాలకూ వస్తున్నాయి. అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారమవుతుండటంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది. ఫలితంగా హాలీవుడ్‌లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీంతోపాటు 2023, 24లలో రచయితల సంఘం, కార్మిక సంఘాలు సమ్మెలు చేయడంతో హాలీవుడ్ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క 2023లోనే 5 బిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు అంచనా. అప్పట్లో సమ్మె కారణంగా పోయిన ఉద్యోగాలు ఇంకా రాలేదు.
ఒకప్పుడు ఫర్నిచర్ వ్యాపారానికి అమెరికాలోని నార్త్ కరోలినా కేంద్ర స్థానంగా ఉండేది. చైనాతోపాటు ఇతర దేశాల నుంచి ఫర్నిచర్ దిగుమతులు పెరగడంతో అది తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.