Trump: గ్రీన్‌లాండ్‌ నాది.. కాదంటే సుంకాలే గతి..ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

Trump: గ్రీన్‌లాండ్‌ నాది.. కాదంటే సుంకాలే గతి..ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..!!

Update: 2026-01-17 00:54 GMT

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు ఈసారి ‘టారిఫ్ అస్త్రం’ను ఉపయోగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైన భూభాగమని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. సహజ వనరులు, రక్షణ పరమైన అంశాలు, భౌగోళిక స్థానం దృష్ట్యా గ్రీన్‌లాండ్ అమెరికా భద్రతకు అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైతే ఆర్థిక ఒత్తిడి కూడా తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఇదే తరహాలో గతంలో యూరప్ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులతో అమెరికా అనుకూల నిర్ణయాలు సాధించామని ట్రంప్ గుర్తు చేశారు. అప్పట్లో వాణిజ్య సుంకాల ద్వారా యూరోపియన్ దేశాలను ఒప్పించగలిగామని, అదే వ్యూహం ఇప్పుడు గ్రీన్‌లాండ్ విషయంలో కూడా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఆర్థిక ఒత్తిడితో దేశాలను తమ వైపు తిప్పుకోవాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే ట్రంప్ వ్యాఖ్యలు డెన్మార్క్‌తో పాటు యూరప్ దేశాల్లో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసే అవకాశం ఉంది. గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం కావడంతో, ఈ వ్యవహారం అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ విధానాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తాయా? లేక రాజకీయ ఒత్తిడి సాధనంగా మాత్రమే పరిమితమవుతాయా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News