Donald Trump: ఇరాన్ ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..నిరసనలు కొనసాగించండని పిలుపు..!!

Donald Trump: ఇరాన్ ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..నిరసనలు కొనసాగించండని పిలుపు..!!

Update: 2026-01-14 06:04 GMT

Donald Trump: ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని స్థాయిలో తీవ్రతను సంతరించుకున్న ఈ నిరసనల నేపథ్యంలో, ఇరాన్ ప్రజలు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. “త్వరలోనే మీకు సహాయం అందుతుంది” అని తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇరాన్‌లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, నియంత్రణలేని ద్రవ్యోల్బణం, స్థానిక కరెన్సీ విలువ పతనం వంటి కారణాలతో ప్రజల ఆగ్రహం రగిలింది. మొదట ఆర్థిక సమస్యలపై మొదలైన నిరసనలు క్రమంగా అక్కడి మతపరమైన పాలనకు సవాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో, ఆందోళనల సమయంలో సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒక ఇరాన్ ఉన్నతాధికారి తొలిసారిగా అధికారికంగా అంగీకరించారు. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని, ఈ హింసాత్మక ఘటనలకు ఉగ్రవాదులే కారణమని ఆయన ఆరోపించారు. అయితే, పౌరులు, భద్రతా బలగాల మృతుల సంఖ్యపై స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై తీవ్రంగా అణచివేత చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధికారులతో జరపాల్సిన అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నిరసనకారులపై హత్యలు, హింస ఆగే వరకు ఇరాన్ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు ఉండవని స్పష్టం చేశారు. అదనంగా, ఇరాన్‌తో వాణిజ్యం చేసే ఏ దేశంపైనా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. చైనా, భారత్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ హెచ్చరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

అమెరికా వైఖరిపై రష్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్ష జోక్యమేనని రష్యా విమర్శించింది. ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడితే మధ్యప్రాచ్య ప్రాంతమంతా తీవ్ర అస్థిరతకు గురవుతుందని, ప్రపంచ భద్రతకే అది ప్రమాదకరమని రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది. చైనా కూడా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తన అభ్యంతరాన్ని తెలియజేసింది.

ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో “లాక్డ్ అండ్ లోడెడ్” అంటూ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామన్న ట్రంప్ వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News