Donald Trump : పాక్-ఆఫ్ఘన్ యుద్ధంలోకి ట్రంప్ ఎంట్రీ.. అవసరమైతే నేనొస్తానంటూ ప్రకటన
పాక్-ఆఫ్ఘన్ యుద్ధంలోకి ట్రంప్ ఎంట్రీ.. అవసరమైతే నేనొస్తానంటూ ప్రకటన
Donald Trump : పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో అవసరమైతే అమెరికా జోక్యం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌పై తనకున్న సాఫ్ట్ కార్నర్‌ను కూడా ట్రంప్ బయటపెట్టారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. వారిద్దరూ గొప్ప నాయకులని, తనకు వారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, శాంతి స్థాపన కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ప్రస్తుతం పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డూరండ్ లైన్ సరిహద్దు వెంట రెండు దేశాల సైన్యాలు భారీ ఆయుధాలతో తలపడుతున్నాయి. టీటీపీ ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో పాకిస్థాన్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 133 మంది తాలిబన్ ఫైటర్లు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. వైమానిక దాడులు, క్షిపణి ప్రయోగాలతో సరిహద్దు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. రెండు వైపులా సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.
ఈ యుద్ధ వాతావరణంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ.. రెండు మిత్ర దేశాల మధ్య సాయుధ పోరాటం పెరగడం ప్రమాదకరమని హెచ్చరించారు. వెంటనే దాడులు ఆపి, దౌత్య మార్గాల్లో చర్చలు జరపాలని రష్యా కోరింది. ఆఫ్ఘనిస్థాన్ కోసం క్రెమ్లిన్ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కాబులోవ్ సైతం ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దుల్లో భారీ ఆయుధాలు, వైమానిక దళాలను మోహరించడం వల్ల ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల మీద కూడా భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాకిస్థాన్ నాయకత్వాన్ని పొగడటం ద్వారా ట్రంప్ ఆ దేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారా? లేక నిజంగానే మధ్యవర్తిత్వం వహించి ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనుకుంటున్నారా? అన్నది చర్చనీయాంశమైంది. 2,611 కిలోమీటర్ల పొడవైన డూరండ్ లైన్‌ను ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటికీ అధికారికంగా గుర్తించకపోవడమే ఈ గొడవలకు అసలు కారణం. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు రంగంలోకి దిగితే తప్ప ఈ యుద్ధ జ్వాలలు ఆరేలా కనిపించడం లేదు.