Pakistan Afghanistan conflict: తారాస్థాయికి పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్, కందహార్‌పై వైమానిక దాడులు
Pakistan Afghanistan conflict: తారాస్థాయికి పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్, కందహార్‌పై వైమానిక దాడులు
Pakistan Afghanistan conflict: తారాస్థాయికి పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్, కందహార్‌పై వైమానిక దాడులు
Pakistan Afghanistan conflict: తారాస్థాయికి పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్, కందహార్‌పై వైమానిక దాడులు
పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాబూల్, కందహార్, పక్తియా నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. కాబూల్ లోని తాలిబాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ “ఓపెన్ వార్” ప్రకటించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవలి వారాలుగా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో, అఫ్గాన్ భూభాగాన్ని మిలిటెంట్ గుంపులు పాకిస్థాన్ సైన్యంపై దాడులకు ఉపయోగిస్తున్నాయని ఇస్లామాబాద్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది.
కాబూల్, కందహార్‌లో పేలుళ్లు
AFP నివేదికల ప్రకారం, పాకిస్థాన్ యుద్ధవిమానాలు కాబూల్, కందహార్ మీదుగా ఎగిరినట్లు సమాచారం. భూమిపై ఉన్న జర్నలిస్టులు రెండు గంటలకుపైగా పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు తెలిపారు. తాలిబాన్ ప్రతినిధి జాబిహుల్లాహ్ ముజాహిద్ దాడులను ధృవీకరించినప్పటికీ, ప్రాణనష్టం ఏదీ జరగలేదని పేర్కొన్నారు.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వి ఈ చర్యను “సరైన ప్రతిస్పందన”గా అభివర్ణించారు. అఫ్గాన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు చెక్‌పోస్టులపై దాడి చేసిన తరువాతే ఈ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు.
తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ X వేదికగా స్పందిస్తూ, దేశ భౌగోళిక సమగ్రత, శాంతిపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. “మా శాంతిని బలహీనతగా భావిస్తే కఠిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సిందే” అని హెచ్చరించారు.
సరిహద్దు ప్రతిదాడుల ఆరోపణలు
దురాండ్ లైన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ సైనిక స్థావరాలపై తామే ముందుగా దాడులు జరిపినట్లు అఫ్గాన్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ అధికారులు తిరస్కరించారు. తమ వైమానిక దాడులు జాతీయ భద్రత పరిరక్షణ కోసమేనని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో స్పందనలు
ఈ పరిణామాలు వెలుగులోకి రాగానే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. కొందరు నెట్టిజన్లు ప్రపంచం మరింత అశాంతి వైపు దూసుకెళ్తోందని వ్యాఖ్యానించగా.. మరికొందరు పాకిస్థాన్ అణ్వస్త్ర శక్తి కలిగిన దేశమని గుర్తుచేస్తూ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంకొందరు హాస్యాస్పదంగా స్పందిస్తూ “ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ యుద్ధం” అంటూ పోస్టులు చేశారు. కొందరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు ప్రస్తావిస్తూ, ఆయన ఇరుదేశాలకు మద్యవర్తిత్వం చేస్తారేమోనని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి ఆందోళన
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ రెండు దేశాలు సహనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పౌరుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వివాదాలను హింస కాకుండా దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితి ప్రాంతీయ భద్రతకు సవాలుగా మారుతుండగా, అంతర్జాతీయ సమాజం దీనిపై దృష్టి సారించింది.