King Mswati III: ఒక్క రాజు.. 15 మంది రాణులు.. ప్రైవేట్ జెట్ నిండా కుటుంబమే..వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక్క రాజు.. 15 మంది రాణులు.. ప్రైవేట్ జెట్ నిండా కుటుంబమే..వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Update: 2026-02-21 02:08 GMT

King Mswati III:ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశం ఈశ్వాతిని. దేశం చిన్నదే కానీ ఆ దేశ రాజు చేసే హంగామా మాత్రం ప్రపంచస్థాయిలో ఉంటుంది. ఈశ్వాతిని రాజు మ్స్వాతి III మరోసారి వార్తల్లో నిలిచారు. 2022 నాటి ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ కావడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న ఆ రాజు గారు తన వెంట ఏకంగా 15 మంది భార్యలు, డజన్ల కొద్దీ పిల్లలు, వందలాది మంది అనుచరులను తీసుకెళ్లడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

వైరల్ అవుతున్న వీడియోలో రాజు మ్స్వాతి III తన ప్రైవేట్ జెట్ విమానం దిగుతుండగా, ఆయన వెనుక వరుసగా రాణులు, పిల్లలు, రాజప్రతినిధులు దిగడం కనిపిస్తుంది. ఇది కేవలం పర్యటనలా కాకుండా ఒక పెళ్లి బృందం వెళ్తున్నట్లుగా ఉందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆయనకు ఉన్న విలాసవంతమైన కార్లు, రాజభవనాల గురించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్ళినప్పటిది. ఆర్థిక సహకారం కోసం వెళ్ళిన రాజు గారు, ఇంత భారీ ఖర్చుతో కూడిన లగ్జరీని ప్రదర్శించడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

ఈశ్వాతిని దేశ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా HIV/AIDS బాధితులు ఉన్న దేశాల్లో ఇది ఒకటి. దేశంలోని సగానికి పైగా జనాభా కనీసం కరెంటు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక, పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్షరాస్యత, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న దేశానికి రాజుగా ఉండి, ప్రజల సొమ్మును తన వ్యక్తిగత విలాసాలకు, భారీ భార్యాగణానికి ఖర్చు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మ్స్వాతి III కేవలం 18 ఏళ్ల వయసులోనే (1986లో) సింహాసనాన్ని అధిష్టించారు. ఆఫ్రికాలో ఇప్పటికీ పూర్తిస్థాయి రాజరికాన్ని నడుపుతున్న ఏకైక పాలకుడు ఆయనే. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సైన్యం.. అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయి. 2022 పర్యటన ఉద్దేశం పెట్టుబడులు తీసుకురావడమే అని అధికారులు చెబుతున్నా, ఆ పర్యటనలో జరిగిన ఖర్చు చూస్తుంటే అది దేశాభివృద్ధి కోసమా లేక రాజకుటుంబం విహారయాత్ర కోసమా అనే సందేహాలు వస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఈ పాత వీడియోలు బయటకు రావడం ఆయన ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తోంది.

Tags:    

Similar News