బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్.. బంగ్లా-భారత్ గొడవలు చల్లారేనా?
Tarique Rahman Sworn in as Bangladesh PM: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధామంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణం చేశారు.
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్.. బంగ్లా-భారత్ గొడవలు చల్లారేనా?
Tarique Rahman Sworn in as Bangladesh PM: పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధామంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణం చేశారు.సంప్రదాయానికి భిన్నంగా బంగ భవన్‌ను కాదని జతియా సంసద్‌వద్ద ఉన్న దక్షిణ ప్లాజా బహిరంగ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఎంతో సందడిగా నిర్వహించారు. దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ రహమాన్‌లో ప్రధానిగా ప్రమాణం చేయించారు. అనంతంర ఆయన క్యాబినెట్‌లో 25 మంది క్యాబినెట్, 24 మంది సహాయ మంత్రులు ప్రమాణం చేశారు. రహమాన్ మంత్రి వర్గంలో ఓ హిందువు, ఓ బౌద్దునికి ప్రాతినిధ్యం కల్పించారు. బంగ్లా ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించినా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పర్యటన నేపథ్యంలో వెళ్లలేక పోయారు ఈ కార్యక్రమంలో భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. వివిధ దేశాల నాయకులు, ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
కాగా బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు భారత ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనను భారత పర్యటనకు ఆహ్వానిస్తూ వ్యక్తిగతంగా ఓ లేఖ రాశారు. ఢాకాలో రహమాన్‌తో భేటీ అయిన స్పీకర్ ఓం బిర్లా ఈ లేఖను అందించారు. బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని తెలిపారు. ఫిబ్రవరి 13నే ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తారిఖ్ రహమాన్ అభినందించారు. ఇటీవల జరగిన బంగ్లాదేశ్ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్‌పీ పార్టీ భారీ విజయం సాధించడం తెలిసిందే. ఆ దేశంలో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటంతో ఇరు దేశాల సంబంధాల పునరుద్దరణపై ఆశలు పెరిగాయి.
షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు క్షీణించాయి. హసీనాకు మన దేశంలో ఆశ్రయం ఇవ్వడమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబూర్ రెహమాన్, ఆయన షేక్ హసీనా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. కాగా బీఎన్‌పీ నాయకురాలు ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మతతత్వ జమాత్-ఎ-ఇస్లామీ పార్టీతో చెలిమిచేసి మన దేశంతో సంబంధాలు దూరం చేసుకున్నారు. తాజాగా ప్రధాని పదవి చేపట్టిన తారిఖ్ రహమాన్ స్వయంగా ఖాలిదాకు తనయుడు. చాలా కాలం విదేశాల్లో ఉండి స్వదేశానికి వచ్చారు. ఎన్నికల సమయంలో తల్లి మరణంతో బీఎన్‌పీ సారధ్య బాధ్యతలు చేపట్టి విజయం సాధించారు. కాగా తమ విదేశాంగ విధానం పూర్తిగా ‘బంగ్లాదేశ్ ఫస్ట్’ ఎజెండాపైనే ఆధారపడి ఉంటుందని రహమార్ తెలిపారు.. బంగ్లా ప్రజల ప్రయోజనాలే అత్యున్నతమని, దాని ప్రకారమే పొరుగు దేశాలతో సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ కొలువు దీరడంతో ప్రపంచమంతా ఈ దేశం వైపు ఇప్పుడు ఆసక్తిగా చూస్తోంది. 2024 ఆగస్టులో అక్కడ జరిగిన విద్యార్థులు తిరుగుబాటు తర్వాత చోటుచేసుకున్న ఆందోళనకు గురి చేయాయి. మైనారిటీలపై.. ముఖ్యంగా హిందువులపై పెద్ద ఎత్తున హింసాత్మక దాడులు, అత్యాచారాలు జరగడం తెలిసిందే. ఒక్క నెల రోజలు కంటే తక్కువ వ్యవధిలోనే కనీసం 12 మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఇందులో చాలా మంది సామూహిక దాడులు, చట్టవిరుద్దమైన శిక్షలు ఎదుర్కొని మరణించినవారే. మైనారిటీలపై ఇప్పటికీ దాడులు కొనసాతున్నాయని చెబుతున్నారు. ఇందుకు బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మతపరమైన తీవ్రవాదం, సంస్థాగత వైఫల్యం ప్రధాన కారణంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ తమపై వరుసగా జరుగుతున్న దాడులకు తెరపడుతుందా అని అక్కడి మైనారిటీలు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌కు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ పూర్తిగి భారత వ్యతిరేక విధానాలు అవలంభించడం తెలిసిందే. కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో తన పదవి నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో మరోసారి భారత్ మీద తన అక్కసును బయట పెట్టుకున్నారు. మరోసారి సెవన్ సిస్టర్స్ మ మీద కవ్వింపు వ్యాఖ్యాలు చేశారు. ‘‘విశాల సముద్రం బంగ్లా దేశ్‌కు కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థికవ్యవస్థతో అనుసంధానం కావడానికి ఉన్న మార్గం అది. నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగిఉంది’’ అని యూనస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌తో కలిపి సబ్-రీజియన్‌గా పేర్కొనడం రెచ్చగొట్టే చర్యేనని స్పష్టమవుతోంది. యూనస్ ఇలా నోరు పారేసుకోవడం కొత్తేం కాదు. గతంలో చైనా పర్యటన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల గురించి ఇలాగే మాట్లాడారు.
బంగ్లాదేశ్‌కు మూడు వైపులా భారత్ దేశ రాష్ట్రాలే ఉంటాయి. దక్షిణ భాగంలో మాత్రమే సముద్రం ఉంది. ఈ కారణంగా ఆ దేశం విదేశాలతో వాణిజ్య సంబంధాల కోసం భారత్ మీదే ఆధారపడక తప్పదు. మరోవైపు మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయులు సమస్యగా మారారు. బంగ్లాదేశ్ మొదటి నుంచి భారత్‌లో సన్నిహిత సంబంధాలు కొనసాగించినా.. తాత్కాలిక సారధి యూనస్
కాలంలో అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆయన హయాంలో భారత్ శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనా వైపు మొగ్గు చూపింది. మరోవైపు అక్కడి మతతత్వ శక్తులు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.. కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను పునరుద్దరించుకోవాలని అక్కడి సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సంబంధాలు గతానికి మాత్రమే పరిమితం కావని, వాణిజ్యం, పెట్టుబడులు, సామాజిక భాగస్వామ్యం ద్వారా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఇందుకు రహమాన్ ఎంత మేరకు సహకరిస్తారో చూడాల్సిందే.